
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న (మార్చి 22) జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను ఆర్సీబీ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి, సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
వెటరన్లు సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి కేకేఆర్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరు మినహా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ 30 పరుగులు చేసినా నిదానంగా ఆడాడు. డికాక్ 4, వెంకటేశ్ అయ్యర్ 6, రింకూ సింగ్ 12, రసెల్ 4 పరుగులకు ఔటయ్యారు.
ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ సామర్థ్యం మేరకు రాణించి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. యశ్ దయాల్ (3-0-25-1) పర్వాలేదనిపించాడు. సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి నయా ఓపెనింగ్ జోడి ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించింది. వీరిద్దరు పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) చెలరేగి పోయి 80 పరుగులు సాధించారు. మంచి పునాది పడటంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది.
సాల్ట్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (10 బంతుల్లో 10) నిరాశపర్చినా ఆతర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీని వేగంగా గెలుపుతీరాలకు చేర్చాడు. ఆఖర్లో లివింగ్‌స్టోన్ (5 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.

కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ (4-0-27-1) మినహా కేకేఆర్ బౌలర్లందరినీ ఆర్సీబీ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఛేదనలో ఆర్సీబీకి డ్యూ ఫ్యాక్టర్ కలిసొచ్చింది. తొలి 10 ఓవర్లలోనే కేకేఆర్ విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో సునీల్ నరైన్ బ్యాట్ వికెట్లకు తాకింది. బెయిల్స్ కూడా కింద పడ్డాయి. అయితే అంపైర్లు మాత్రం నరైన్‌ను హిట్ వికెట్‌గా ప్రకటించలేదు.
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025
సదరు బంతిని అంపైర్ వైడ్ బాల్‌గా సిగ్నల్ ఇవ్వడం.. అప్పటికే వికెట్ కీపర్ జితేష్ శర్మ బంతిని సేకరించడం, నరైన్ తన డెలివరీ యాక్షన్‌ను పూర్తి చేయడంతో అంపైర్ నరైన్‌ను హిట్‌వికెట్‌గా ప్రకటించలేదు.
ఎంసీసీ నియమాల ప్రకారం, ఒక బ్యాటర్ బంతిని ఆడుతున్నప్పుడు లేదా పరుగు కోసం స్టార్ట్ అవుతున్నప్పుడు లేదా వికెట్‌ను కాపాడుకోవడానికి రెండవ హిట్ చేస్తున్నప్పుడు బ్యాట్ స్టంప్‌లను తగిలితే అప్పుడు ఆ బ్యాటర్‌ను ఔట్ హిట్ వికెట్‌గా పరిగణిస్తారు.
షాట్ ఆడిన తర్వాత లేదా డెలివరీ పూర్తయిన తర్వాత బ్యాట్ స్టంప్‌లను తాకితే అది ఔట్ హిట్ వికెట్‌గా పరిగణించబడదు. తాజా ఉదంతంలో బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నరైన్ బ్యాట్ స్టంప్‌లను తాకినందున, ఎంసీసీ లా 35.2 ప్రకారం దానిని నాటౌట్‌గా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment