IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ! | IPL 2026: Why Ambani's Sit In Sofas Near Boundary-Other Owners Don't | Sakshi
Sakshi News home page

IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ!

Mar 30 2026 1:46 PM | Updated on Mar 30 2026 2:03 PM

IPL 2026: Why Ambani's Sit In Sofas Near Boundary-Other Owners Don't

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత ఖ‌రీదైన జట్ల‌లో ముంబై ఇండియ‌న్స్ ఒక‌టి. ఖ‌రీదైన జ‌ట్టుగా మాత్రమే గాక క్యాచ్ రిచ్ లీగ్‌లో అత్య‌ధిక టైటిల్స్ కొట్టిన జ‌ట్టుగానూ ముంబై ఇండియ‌న్స్‌కు పేరుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ కొట్టిన ముంబై ఇండియ‌న్స్‌ చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో క‌లిసి స‌మానంగా ఉంది. 

ముంబై ఇండియ‌న్స్ యాజామాన్యం ఎవ‌ర‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో చోటు ద‌క్కించుకున్న ముకేశ్ అంబానీ ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీకి ఓన‌ర్‌. అంబానీ ఫ్యామిలీ ఏది చేసినా రిచ్‌గానే క‌నిపిస్తుంటుంది. ఐపీఎల్‌లోనూ అది ఎన్నోసార్లు స్ప‌ష్టంగా తెలిసొచ్చింది. 

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు టైటిల్ గెలిచిన ప్ర‌తీసారి అందులో ఉండే ఆట‌గాళ్ల‌కు అంబానీ ఫ్యామిలీ ఎన్నో విలువైన కానుకలు కూడా అందించింది. తాజాగా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌మ తొలి మ్యాచ్‌ను ఆదివారం కేకేఆర్‌తో ఆడింది. ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.

అదేంటంటే.. కేకేఆర్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా నీతా అంబానీ ఫ్యామిలీకి వాంఖ‌డే స్టేడియం డ‌గౌట్‌కు స‌మీపంలో వేసిన ప్ర‌త్యేక బ్లూ సోఫాలో ఆసీనుల‌య్యారు. మ్యాచ్ ఆద్యంతం అక్క‌డే కూర్చుని నీతా అంబానీ జ‌ట్టు స‌భ్యుల‌ను చీర్ చేశారు. అయితే అభిమానుల‌కు ఇక్క‌డే ఒక సందేహం క‌లిగింది. 

వాస్త‌వానికి ఏ ఫ్రాంచైజీ ఓన‌ర్ అయినా బాక్స్‌లో లేదా అభిమానుల మ‌ధ్య‌లో కూర్చొని మ్యాచ్ వీక్షించ‌డం ఆన‌వాయితీ. కానీ ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేసి మైదానం డ‌గౌట్‌లో ప్ర‌త్యేక సోఫాలో అంబానీ ఫ్యామిలీని ఎందుకు కూర్చోబెట్టా ర‌న్న‌ది ఆస‌క్తి క‌లిగించింది. మ‌రి అంబానీ ఫ్యామిలీకే ఎందుకు సోఫాలు వేస్తారు. మిగతా ఓనర్లకు  ఎందుకు వేయర‌న్న‌ ప్రశ్నలు చాలా మందిలో త‌లెత్తాయి. గతంలోనూ అంబానీ కుటుంబం ఎందుకు మైదానం సమీపంలో వేసిన సోఫాలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షి​స్తారనే ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి.

నీతా అంబానీ టీమ్ ఓనరే కాదు.. ఆమె ముంబై జ‌ట్టుకు సీఈవో. టీమ్ మీటింగ్స్, స్టాటజీ మీటింగ్, ప్లేయర్ మీటింగ్ లకి  నీతా అంబానీ తరచూ హాజరవుతూ ఉంటారు. ముంబై ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు అంబానీ ఫ్యామిలీ వేరే టీమ్ ఫ్రాంచైజీకి కూడా స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రి స్తుంటారు. దీనికి తోడు భార‌త్‌లోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ముకేశ్ అంబానీ అగ్ర‌స్థానంలో ఉన్నారు. 

అంబానీ ఫ్యామిలీ వ‌ద్ద డ‌బ్బులకు కొదవ లేకపోవ‌డంతో ప్ర‌పంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐకి కూడా అంబానీ ఫ్యామిలీ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌రిస్తున్న‌ట్లు వార్త‌లున్నాయి. అందుకే బీసీసీఐ కూడా అంబానీ ఫ్యామిలీ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం లేద‌నిపిస్తోంది.  బ‌హుశా ఈ కార‌ణం చేత‌నే ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్‌లు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా మైదానం డ‌గౌట్ స‌మీపంలో బ్లూ సోఫాను ఉంచుతున్నట్లుగా అనిపి స్తోంది. 

ఇతర జట్ల యజమానులు మాత్రం వీఐపీ బాక్స్, కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొవడం లేదా నిలబడి మ్యాచ్ ని వీక్షిస్తుంటారు. కానీ ముంబై ఇండియన్స్ యజమానులు రాయల్ గా గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మ‌రోసారి వైర‌ల్‌గా మారాయి.

 

చదవండి: టైగర్‌వుడ్స్‌కు ట్రంప్‌ మాజీ భార్య వార్నింగ్‌!

Advertisement
 
Advertisement
Advertisement