‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’ | Irani Cup 2024: Ruturaj Gaikwad Fails To Impress Fans Says Cant Blame Selectors | Sakshi
Sakshi News home page

‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’

Published Thu, Oct 3 2024 1:47 PM | Last Updated on Thu, Oct 3 2024 3:01 PM

Irani Cup 2024: Ruturaj Gaikwad Fails To Impress Fans Says Cant Blame Selectors

టీమిండియా స్టార్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇరానీ కప్‌-2024 మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని  కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.

కాగా రంజీ చాంపియన్‌ ముంబై- రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్‌ టైటిల్‌ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్‌బాల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

సర్ఫరాజ్‌ డబుల్‌ సెంచరీ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (276 బంతుల్లో 221 బ్యాటింగ్‌; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై  138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.

కెప్టెన్‌ అజింక్య రహానే, షమ్స్‌ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్‌ కోటియాన్‌ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్‌ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్‌లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్‌ రికార్డు సృష్టించాడు.

భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!
ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్‌ దేశవాళీల్లో భీకర ఫామ్‌ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా కెప్టెన్‌ రుతురాజ్‌ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్‌ జునైద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు షాక్‌ తగిలింది.

అయితే, మరో ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్‌(32) అతడికి సహకారం అందించాడు.  ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.

సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?
కాగా టీమిండియా టెస్టు ఓపెనర్‌గా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్‌ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్‌ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్‌స్టర్‌ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్‌ ఓపెనర్‌గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో.. ఇటీవల దులిప్‌ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్‌.. మూడు మ్యాచ్‌లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్‌ మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. 

కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్‌ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్‌ ప్రేమికులు అంటున్నారు.

చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్‌ శర్మ


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement