
లండన్: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ ఇటలీ ఫుట్‌బాల్ జట్టు యూరో కప్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో ఇక్కడి వెంబ్లీ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్‌లో 4–2తో మూడుసార్లు చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. గత 34 మ్యాచ్‌ల్లో ఇటలీకి ఓటమి లేకపోవడం విశేషం. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఇటలీ తరఫున 60వ నిమిషంలో చియేసా గోల్ చేయగా... స్పెయిన్ తరఫున 80వ నిమిషంలో మొరాటా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.