SRH: మాకున్న బలం అదే.. తగ్గేదేలే: కమిన్స్‌ | Its Not Going To Work: Cummins Blunt Take On SRH Approach Despite Loss Vs RCB | Sakshi
Sakshi News home page

SRH: మాకున్న బలం అదే.. ఇక ముందు కూడా తగ్గేదేలే: కమిన్స్‌

Published Fri, Apr 26 2024 9:06 AM | Last Updated on Fri, Apr 26 2024 6:36 PM

Its Not Going To Work: Cummins Blunt Take On SRH Approach Despite Loss Vs RCB

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవానికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్‌ మైదానంలో ప్యాట్‌ కమిన్స్‌ బృందాన్ని 35 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్‌ లెక్క సరిచేసింది.

రాణించిన కోహ్లి, పాటిదార్‌, గ్రీన్‌ 
ఇరుజట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. విరాట్‌ కోహ్లి (51), రజత్‌ పాటిదార్‌(20 బంతుల్లో 50) అర్ధ శతకాలు సాధించగా.. కామెరాన్‌ గ్రీన్‌(20 బంతుల్లో 37*) దూకుడుగా ఆడాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ 206 పరుగులు స్కోరు చేసింది. ఇప్పటికే ఈ సీజన్‌లో మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు సాధించిన రైజర్స్‌ ఈ లక్ష్యాన్ని తేలికగ్గానే ఛేదిస్తుందని ఆరెంజ్‌ ఆర్మీ భావించింది.

దూకుడుగా ఆరంభించి.. భారీ మూల్యమే చెల్లించి
కానీ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 171 పరుగులకే రైజర్స్‌ కథ ముగిసిపోయింది. విధ్వంసకర ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(1) ఆదిలోనే అవుట్‌ కావడం.. అభిషేక్‌ శర్మ(13 బంతుల్లో 31) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం ప్రభావం చూపింది.

అయినప్పటికీ దూకుడును కొనసాగించిన రైజర్స్‌ బ్యాటర్లు ఐడెన్‌ మార్క్రమ్‌(7), నితీశ్‌ రెడ్డి(13), హెన్రిచ్‌ క్లాసెన్‌(7)లను ఆర్సీబీ బౌలర్లు త్వరత్వరగా పెవిలియన్‌కు పంపారు. 

కాసేపు పోరాడినా
ఈ క్రమంలో ఆరో స్థానంలో వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ (37 బంతుల్లో 40 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌(15 బంతుల్లో 31) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓటమిని అంగీకరించింది. 

ఇక ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, లాకీ ఫెర్గూసన్‌ రెండేసి వికెట్లు తీయగా.. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాళ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఓటమిపై స్పందిస్తూ.. తమ బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని సమర్థించాడు. ‘‘ఈరోజు మాకు సరైన ముగింపు లభించలేదు. తొలుత పరుగులు కట్టడి చేయలేకపోయాం.

ప్రతి మ్యాచ్‌ గెలవలేం
ఆ తర్వాత లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయాం. నిజానికి మేము ముందుగా బ్యాటింగ్‌ చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా మా వాళ్లు చాలా బాగా ఆడారు. టీ20 క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్‌ గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఓటమినే తలచుకుంటూ కూర్చోము.

మాకున్న బలం అదే
రిస్క్‌ ఉన్నా సరే దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే మాకున్న బలం. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ ఇది వర్కౌట్‌ అవ్వాలని లేదు. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ మ్యాచ్‌లో మేము మెరుగైన స్కోరే చేశాం. ఇక ముందు కూడా మా వాళ్లు ఇంతే దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే మంచిదని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

చదవండి: #Kavya Maran: అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్ష‌న్ వైర‌ల్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement