వెల్లింగ్టన్: ఒక బ్యాట్స్‌మెన్ తన ప్రత్యర్థి బౌలర్‌ను ఉతికి ఆరేస్తే.. తరువాతి మ్యాచ్‌లో అతని వికెట్ తీసేందుకు కసిమీద ఉంటాడు సదరు బౌలర్. కానీ న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ నీషమ్ మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకతను చూపించాడు. తనను ఉతికారేసిన బ్యాట్స్‌మన్‌కు తన జెర్సీనే కానుకగా ఇచ్చి అతన్ని సంతోషపరిచాడు. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో కాదు.. ఆసీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. తాజాగా ఆసీస్ 5 టీ20ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ నీషమ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మ్యాక్సీ నీషమ్ వేసిన ఆరు బంతులను వరుసగా 4,6,4,4,4,6 బాది మొత్తం ఆ ఓవర్లో 28 పరుగులు పిండుకున్నాడు. దీంతో నీషమ్ తన 4 ఓవర్ల కోటాలో ఒక వికెట్ కూడా తీయకుండా 60 పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఏ బౌలర్ అయినా తన బౌలింగ్‌ను చీల్చి చెండాడిన బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. కానీ అందుకు భిన్నంగా నీషమ్ తన జెర్సీపై''టు.. మ్యాక్సీ.. 4,6,4,4,4,6.. బై నీషమ్'' అంటూ రాసి మ్యాక్సీకి అందజేశాడు. నీషమ్ ఎంతో ప్రేమగా తన జెర్సీని ఇవ్వడంతో నవ్వుతూ తీసుకున్న మ్యాక్సీ తన జెర్సీని నీషమ్‌కు ఇచ్చాడు. ఇలా ఒకరి జెర్సీలు ఒకరు మార్చుకున్న సమయంలో దిగిన ఫోటోను వారు పంచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య 5 టీ20ల సిరీస్‌ను కివీస్ 3-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి టీ20లో కివీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
చదవండి:
మ్యాక్సీ సిక్సర్ దెబ్బకు విరిగిన కుర్చీ వేళానికి..
Comments
Please login to add a commentAdd a comment