స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టుతో పాటు భారత్‌కు బయల్దేరనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ చీఫ్ సెలక్టర్ లూక్ రైట్ వెల్లడించాడు. ఆర్చర్ గాయం నుంచి పూర్తి కోలుకోనప్పటికీ.. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉంటాడని ప్రకటించాడు. టీమ్‌తో ఉంటూనే ఆర్చర్ రిహాబ్‌లో కొనసాగుతాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్ జట్టులో దురదృష్టవశాత్తు ఎవరైనా గాయపడితే ఆర్చర్ అందుబాటులో ఉంటాడని తెలిపాడు.
జట్టుతో పాటు ఉంటే ఆర్చర్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని, అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే వరల్డ్‌కప్‌లో ఏ సమయంలోనైనా అతని సేవలు వినియోగించుకుంటామని అన్నాడు. ఆర్చర్ త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీమ్ చేయాల్సిందంతా చేస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించే సందర్భంలో లూక్ రైట్ ఈ విషయాలను వెల్లడించాడు.
కాగా, ఇంగ్లండ్ సెలెక్టర్లు నిన్న ప్రపంచకప్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు ఓ కీలక మార్పు చేశారు. స్టార్ బ్యాటర్ జేసన్ రాయ్‌పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్.. ఎంతకీ కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, ఆర్చర్ గత కొన్ని నెలలుగా వేర్వేరు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆర్చర్ గాయాల జాబితాలో కుడి మోచేతి ఫ్రాక్చర్ ప్రధానమైంది. ఈ గాయం కారణంగానే అతను ప్రతిష్టాత్మక యాషెస్ సహా పలు కీలక సిరీస్‌లు, ఐపీఎల్‌ను మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్చర్ గాయాల నుంచి కోలుకుంటూ రిహాబ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సెలెక్టర్ల తాజా నిర్ణయంతో ఆర్చర్ ఇంగ్లండ్ జట్టుతో పాటు వరల్డ్‌కప్‌కు వేదిక అయిన భారత్‌కు వెళ్తాడు.
ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్ విల్లీ, సామ్ కర్రన్
ట్రావెలింగ్ రిజర్వ్: జోఫ్రా ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment