
Suryakumar Yadav- Sanju Samson: ‘‘ఎవరైతే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారో వాళ్లకు తప్పకుండా వరుస అవకాశాలు లభిస్తాయి. సూర్యతో సంజూ శాంసన్‌ను పోల్చకండి. ప్రస్తుతం ఇలాంటి పోలికలు సరికాదు. ఒకవేళ సంజూకి సూర్య లాంటి పరిస్థితే ఎదురైతే మనం వేరొకరి గురించి మాట్లాడే వాళ్లం కదా!’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు.
ఎవరికి ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలనేది పూర్తిగా మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.
మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. తీవ్ర విమర్శల పాలయ్యాడు. వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను కాదని సూర్యకు అవకాశం ఇస్తే.. మరీ ఘోరంగా విఫలమయ్యాడంటూ అభిమానులు దుమ్మెత్తిపోశారు.
ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘‘టీమ్ మేనేజ్‌మెంట్ సూర్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా నిలవాలని భావిస్తే అతడికే వరుస అవకాశాలు ఇస్తుంది. బయట జనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ, జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. కాబట్టి ఇలాంటి పోలికలు వద్దు’’ అని ఏబీపీ న్యూస్‌తో వ్యాఖ్యానించాడు.
ఇదేమీ కొత్తకాదు
అదే విధంగా సూర్య బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ..‘‘మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆఖరి వన్డేలో ఫినిషర్ పాత్ర పోషిస్తాడనే భావనతో సూర్యకుమార్‌ను ఏడో స్థానంలో పంపినట్లు అనిపిస్తోంది. వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం సర్వసాధారణమే.
ఇంతకుముందు కూడా టీమిండియా ఎన్నోసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసింది. అయితే, కొన్నిసార్లు టాపార్డర్ బ్యాటర్‌ను డౌన్ ఆర్డర్‌లో పంపితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జట్టుకు సంబంధించిన ప్రతి విషయంలో కోచ్, కెప్టెన్ ప్రధాన పోషిస్తారు కదా! ఎవరైనా ఆటగాడు తనకు బ్యాటింగ్ పొజిషన్‌లో ఇబ్బంది ఉందని చెబితే.. వాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
కాగా తొలి రెండు వన్డేల్లో తన రెగ్యులర్ పొజిషన్ అయిన నాలుగో స్థానంలో వచ్చిన సూర్య మూడో వన్డేలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్ వేదికగా జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని టీమిండియా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ సొంతం చేసుకుంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు దూరమైనా పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం!
Kane Williamson: 99వ పుట్టినరోజుకు ముందు.. వీరాభిమానికి కేన్‌మామ సర్‌ప్రైజ్ గిఫ్ట్! ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment