అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో కింగ్స్ ఎలెవన్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. చార్జర్స్ ఎలెవన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ జట్టు మూడు పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. కింగ్స్ జట్టు బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మాŠయ్‌చ్’ పి.తపస్వీ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చార్జర్స్ జట్టులో రషీద్ (41 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుమంత్ (39) మెరిసినా కీలకదశలో అవుటవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
అంతకుముందు కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ సీఆర్ జ్ఞానేశ్వర్ (52; 6 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. మరో మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలుత టైటాన్స్ జట్టు 8 వికెట్లకు 151 పరుగులు చేయగా... చాంపియన్స్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రికీ భుయ్ (42 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. గిరినాథ్ (33), అశ్విన్ హెబర్ (36) కూడా రాణించడంతో చాంపియన్స్ జట్టు ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది.
క్వార్టర్స్‌లో దివిజ్ జంట
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): అస్తానా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో దివిజ్–బామ్‌బ్రిడ్జ్ ద్వయం 7–5, 4–6, 10–6తో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) జోడీని ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment