సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఆ గడ్డపై అడుగుపెట్టింది. అందుకు తగ్గట్టుగానే టీమిండియా తమ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలిటెస్టు జరగనుంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, వన్‌డౌన్‌లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లి ఆడడం ఖాయం.
చదవండి: జీవితంలో మళ్లీ టెస్టులు ఆడతాననుకోలేదు: కేఎల్ రాహుల్
అయితే ఐదో స్థానానికి మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. కొన్నేళ్లుగా ఆ స్థానంలో అజింక్యా రహానే ఆడుతూ వస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రహానే దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీనియారిటికి ప్రాధాన్యమిచ్చి సెలెక్టర్లు రహానేకు సౌతాఫ్రికా టూర్‌కు అవకాశం కల్పించారు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి గైర్హాజరీలో రహానే నాలుగో స్థానంలో రాగా.. శ్రేయాస్ అయ్యర్ ఐదో స్థానంలో వచ్చి దుమ్మురేపాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ, అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐదోస్థానంపై కీలకవ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో రాహుల్ మాట్లాడాడు.
''ప్రస్తుతం మా టెస్టు జట్టులో ఐదోస్థానం చాలా కీలకం. అయితే ఈ స్థానంలో రహానేను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. తన టెస్టు కెరీర్‌లో ఎక్కువసార్లు ఐదోస్థానంలోనే వచ్చిన రహానే ఎన్నో మరిచిపోలేని ఇన్నింగ్స్‌లు ఆడాడు. పుజారాతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఆసీస్ గడ్డపై గతేడాది మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఐదో స్థానంలో వచ్చిన రహానే సెంచరీ సాధించడమేగాకుండా జట్టుకు విజయాన్నిఅందించాడు.
చదవండి: "ఈ సారి కూడా విజయం మాదే.. టీమిండియాకు ఓటమి తప్పదు"
ఇక ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో పుజారాతో కలిసి ఆడిన ఇన్నింగ్స్...మ్యాచ్ గెలుపును ఎప్పటికి మరిచిపోము. కానీ 15-18 నెలల నుంచి రహానే తన ఫామ్‌ను కోల్పోయాడు. అంతమాత్రానికే రహానేను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం వ్యర్థం. అయితే శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీలు కూడా మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్. కానీ తుది జట్టులో ఎవరు ఉంటారన్నది చెప్పడం కష్టం. ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. మరికొన్ని గంటల్లో తొలి టెస్టు ఆడే జట్టును ప్రకటిస్తారు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గాయంతో టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment