సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ నిన్న జరిగిన తొలి వన్డేలో పరాజయం చెందడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొదటి వన్డేలో తమ ఓటమికి బాడీ లాంగ్వేజ్ సరిగా లేకపోవడమే కారణమని జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలపై మండిపడ్డాడు. పలు క్యాచ్‌లను వదిలేయడమే తమ పరాజయానికి కారణమన్నాడు. ఆసీస్ వంటి పటిష్టమైన జట్టుపై క్యాచ్‌లు వదిలేస్తే ఫలితం ఇలానే ఉంటుందని అసహనం వ్యక్తం చేశాడు. తాము చేసిన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా మూల్యం చెల్లించుకున్నామన్నాడు. (ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం!)
మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. ‘ మేము దారుణంగా ఫీల్డింగ్ చేశాం. ఏదో అలసిపోయినట్లు ఫీల్డింగ్ తప్పిదాలు చేశాం. ప్రధానంగా 25 ఓవర్ల తర్వాత మా ఫీల్డింగ్ చాలా నిరాశపరిచింది. ఒక నాణ్యమైన జట్టుతో ఆడేటప్పుడు ఫీల్డింగ్ అనేది చాలా ముఖ్యం. ఫీల్దింగ్ సరిగా చేయకపోతే ఒక మంచి జట్టు చేతిలో ఇలాంటి పరాభవమే ఎదురవుతుంది. మాకు హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ బౌలింగ్ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేడు. ఆసీస్ జట్టులో స్టోయినిస్, మ్యాక్స్‌వెల్‌లు బౌలింగ్ ఆల్‌రౌండర్లు. మాకు హార్దిక్ ఉన్నా బౌలింగ్ పరంగా ఫిట్‌నెస్ సాధించకపోవడం చాలా దురదృష్టకరం’ అని తెలిపాడు.(మా కెప్టెనే కదా అని క్యాచ్ వదిలేశాడేమో?)
ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్‌లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా(90; 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్(74; 86 బంతుల్లో 10 ఫోర్లు)లు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించడంతో ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఫించ్(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment