భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) సముచిత స్థాయిలో గౌరవించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని రెండు ఎండ్‌లకు ఈ ఇద్దరి పేర్లు పెట్టింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ద్రవిడ్, కుంబ్లే ఎండ్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌సీఏ ప్రతినిధులతో పాటు... ద్రవిడ్, కుంబ్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ... ‘ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా ఈ మైదానం వల్లే. కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు’ అని అన్నాడు. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవలందించిన ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 24, 177 పరుగులు చేయగా... కుంబ్లే ఓవరాల్‌గా 956 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: సీఎస్‌కే అంటే కోహ్లీకి పూనకమే!


