ఫిఫా వరల్డ్ కప్ ముగిసి వారం కావొస్తున్నా.. ఆ కిక్ నుంచి మాత్రం ఫుట్‌బాల్ అభిమానులు బయటపడలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ. జట్టును అన్నీ తానై నడిపించడమే గాక కీలకమైన ఫైనల్లో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలబెట్టాడు. పనిలో పనిగా ఫిఫా టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు.
ఆ క్షణం నుంచి మెస్సీ మాయలో పడిపోయిన అభిమానులు అతని జపమే చేస్తున్నారు. ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘనస్వాగతం లభించింది. ఇసుక వేస్తే రాలనంతో జనంతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధులు నిండిపోయాయి. ముందుకు కదల్లేని పరిస్థితిలో మెస్సీ బృంధాన్ని హెలికాప్టర్ సాయంతో వారి స్వస్థలాలకు తరలించాల్సి వచ్చింది. అలా మెస్సీకి తన స్వస్థలంలోనూ జనం నీరాజనం పట్టారు.
ఇక ఫైనల్లో విజయం తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ నల్లకోటు ధరించి ఫిఫా టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. మెస్సీ ధరించిన నల్లకోటు సెలబ్రేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ కోటు ధర తెలిస్తే షాక్ తినడం గ్యారంటీ. అంతలా ఆ కోటులో ఏముందనుకుంటున్నారా. బంగారు వర్ణంతో తయారు చేయడమే ఆ కోటు స్పెషాలిటీ.
ట్రోఫీ అందుకునే ముందు ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీకి ఎవరు బహూకరించారో తెలుసా.. ఒమన్‌కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అందుకు నీకు 10 లక్షల డాలర్లు ఇస్తున్నాను'' అంటూ అహ్మద్ ట్వీట్ చేశాడు.
అరబ్ దేశాల్లో మగవాళ్లు పెళ్లిళ్లు, మతపరమైన పండుగల వేళ అలాంటి కోటు వేసుకుంటారు. ఇక హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. దాంతో, 32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2014 ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా జర్మనీపై ఓడిపోవడంతో కప్ చేజారింది. కానీ ఈ సారి మాత్రం ఆ చాన్స్‌ను మిస్ చేసుకోని మెస్సీ ఫిఫా టైటిల్‌ను ఒడిసిపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment