మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో తన కూతురు పేరు లేకపోవడం పట్ల షూటర్ మనూ భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్ కూడా అవార్డుల కోసం అడుక్కోవాలా?.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా క్రీడాకారులను సమున్నత రీతిలో గౌరవించేందుకు భారత ప్రభుత్వం ఏటా పురస్కారాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అన్నింటికంటే అత్యున్నత పురస్కారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యులతో కూడిన జాతీయ స్పోర్ట్స్ డే కమిటీ ఖేల్ రత్న అవార్డుల నామినీల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
అయితే, ఇందులో మనూ భాకర్‌కు మాత్రం చోటు దక్కలేదు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లను అవార్డు కోసం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివాదం చెలరేగగా.. మనూ భాకర్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా శాఖ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అవార్డుల కోసం అడుక్కోవాలా?
ఈ నేపథ్యంలో మనూ తండ్రి రామ్ కిషన్ భాకర్ ఘాటుగా స్పందించారు. ‘‘ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచినప్పటికీ.. అవార్డుల కోసం అడుక్కోవాలా? ఒక ప్రభుత్వ అధికారి నిర్ణయం తీసుకుంటే.. కమిటీ సభ్యులంతా సైలెంట్‌గా ఉంటారా? వారు తమ అభిప్రాయాలను బయటకు చెప్పరా? అథ్లెట్లను ప్రోత్సహించే విధానం ఇదేనా? నాకైతే ఏం అర్థం కావడం లేదు.
మేము అవార్డు కోసం అప్లై చేశాము. కానీ కమిటీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. పిల్లలను తల్లిదండ్రులు క్రీడల్లో ప్రోత్సహించాలా లేదంటే.. ప్రభుత్వంలో ఐఆర్‌ఎస్ ఆఫీసర్లు అవ్వమని బలవంతం చేయాలా?’’ అంటూ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ రామ్ కిషన్ భాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్ కాంస్య పతకాలు సాధించింది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా 22 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment