భారత స్టార్ క్రికెటర్లు వణుకుతున్నారు. ఇది వరకటి లా జట్టులో తమ స్థానం సుస్ధిరం కాదని వారికి తెలిసిపోయింది. కొత్త కుర్రాళ్లు తమ స్థానాలకు ఎసరు పెట్టడం ఖాయమని అర్ధమైపోయింది. ఫిట్ నెస్ కాపాడుకోవడమే కాదు నిలకడగా రాణించకపోతే ఎవరో ఒక యువ ఆటగాడు వచ్చి మన చోటు కబ్జా చేస్తాడని సీనియర్లు భయపడుతున్నారు. ఇపుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లు జట్టులో లేకపోయినా భారత్ విజయాల పరంపరకు ఎక్కడా అడ్డంకులు లేవు. వరుసగా సిరీస్ లు గెలుచుకుంటూ పోతున్నారు. సో సీనియర్లకు ఇక కష్టకాలమే.
యువ జోరు మొదలు కాక ముందు భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ థావన్, విరాట్ కోహ్లి, కె.ఎల్.రాహుల్, రవీంద్ర జడేజా, పుజారా వంటి సీనియర్లు డెమీ గాడ్స్ గా వెలిగిపోయారు.
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు..
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనర్ గా వచ్చి వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు. హిట్ మ్యాన్ గా పేరు సంపాదించుకుని పుల్ షాట్స్ తో బౌలర్లకు సింహ స్వప్నంగా మారాడు. గాయాలతో ఎప్పుడైనా జట్టుకు దూరం అయితే రోహిత్ మళ్లీ ఎప్పుడు జట్టులో చెరుతాడో అని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురు చూసేవారు.
విరాట్ కోహ్లి..
ఇక పరుగుల యంత్రం విరాట్ కోహ్లి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. క్రికెట్ లో ప్రత్యేకించి బ్యాటింగ్ లో ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నింటినీ బ్రేక్ చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. కోవిడ్ కు ముందు ఫాం కోల్పోయిన విరాట్ కోహ్లి ఇంచుమించు మూడేళ్ల పాటు సెంచరీ కొట్టలేకపోయాడు. అంతే కాదు కెప్టెన్సీ కూడా పోగొట్టుకున్నాడు. అయితే గతేడాది ఆసియాకప్‌లో ఫామ్‌లోకి వచ్చినప్పటి నుంచి కోహ్లి వరుస సెంచరీలతో అలరిస్తున్నాడు.
శిఖర్ ధావన్..
శిఖర్ ధావన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎడం చేతి ఆటగాడైన ధావన్ వన్డేలు , టెస్టుల్లోనే కాదు టీ ట్వంటీల్లోనూ అదరగొట్టాడు. ఐపీఎల్ లో కూడా ధావన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. రోహిత్ శర్మ థావన్ ల ఓపెనింగ్ జోడీ గంగూలీ-టెండూల్కర్ ల తర్వాత అంత గొప్పదని క్రికెట్ నిపుణులు ఇప్పటికీ అభిప్రాయపడతున్నారు. అయితే ఇటీవల కాలంలో ధావన్ వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో సెలక్టర్లను అతడిని పక్కన పెట్టారు. యువ క్రికెటర్‌లు అద్భుతంగా రాణిస్తుండడంతో ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చేప్పుకోవాలి.
కేఎల్ రాహుల్..
ఐపీఎల్ కింగ్ కేఎల్ రాహుల్ ది డిఫరెంట్ స్టైల్. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఫార్మెట్ ఏదైనా సరే తనదైన శైలిలో ఆడుతూ పరుగుల వరద పారించడంలో రాహుల్ ను మించిన వాళ్లే లేరు. ధావన్ తర్వాత రోహిత్ తో ఓపెనింగ్ స్లాట్ ను పంచుకుంటున్నాడు రాహుల్. అయితే ఎప్పుడు ఫాంలో ఉంటాడో ఎప్పుడు పేలవంగా ఆడతాడో తెలీని పరిస్థితి. తనదైన రోజున ఎలాంటి బౌలర్ కి అయినా చుక్కలు చూపించే రాహుల్ ఒక్కో సారి పార్ట్ టైమ్ బౌలర్ కే వికెట్ ఇచ్చి పెవిలియన్ చేరుతూ ఉంటాడు.
రవీంద్ర జడేజా
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువే. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసే జడేజా తిరుగులేని ఆల్ రౌండర్. గాయాల కారణంగా జట్టుకు దూరమైన జడేజా తిరిగి జట్టులోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌తో తిరిగి జడ్డూ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే తనకు వచ్చిన అవకాశాలను జడ్డూ అందిపుచ్చుకోపోతే జట్టులో చోటు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకుంటే ప్రస్తుతం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు.
ఛతేశ్వర్ పుజారా..
టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో మరో ఆణిముత్యం పుజారా. రాహుల్ ద్రావిడ్ లా గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాలా వికెట్లు కాపాడుకుంటూ ఉండే పుజారా కొంత కాలంగా అంత ఫామ్ లో లేడు. అతనిలోని మ్యాజిక్ ఎక్కడో మిస్ అయినట్లు అనిపిస్తోంది. అయితే గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పుజారా పర్వాలేదనిపించాడు. మరోవైపు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పుజారా ఏ మెరకు రాణిస్తాడో వేచి చూడాలి.
ఇండియన్ క్రికెట్ జట్టులోని ఈ సీనియర్లంతా నిన్నా మొన్నటి వరకు గాయాలైతే తప్ప జట్టులో స్థానాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయని ఎవరూ అనుకునే వారే కారు. కానీ ఇపుడు పరిస్థితి మారిపోయింది. ఈ సీనియర్లందరికీ ఎసరు పెట్టే యువ హీరోలు అద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో భయపెట్టేస్తున్నారు. ఓపెనర్లు గిల్, ఇషాన్ కిషన్ ,ప్రృథ్వీ షా లతో పాటు మిడిలార్డర్ లో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ,దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, త్రిపాఠీ లు సీనియర్లకు చెక్ చెబుతున్నారు.
తాజాగా న్యూజిలాండ్ పై భారత జట్టు టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇందులో యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ప్రత్యేకించి మూడో టీ20లో గిల్, త్రిపాఠీ, పాండ్యా లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సీనియర్లు రోహిత్, విరాట్ ,రాహుల్ లు లేని లోటే తెలియలేదు. ఇలా సీనియర్లు గుర్తుకు రానంతగా జూనియర్లు సత్తా చాటుతున్నారు. అంటే సీనియర్లు లేకపోయినా భారత్ విజయాలకు ఢోకా లేదని సృష్టంగా తెలుస్తోంది.
సీనియర్లకు ఇది ప్రమాద సూచికే..
యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండడం సీనియర్లకు ప్రమాద సూచికే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోతే చాలు.. ఏకంగా జట్టుకే దూరమయ్యే ఛాన్స్ ఉంది అని పలువురు వాపోతున్నారు. బౌలింగ్ విభాగంలో భారత స్టార్ బౌలర్ అయిన బుమ్రా గాయాల కారణంగా జట్టుకు దూరం అయినపుడు.. అయ్యో జట్టు పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందారు.
బుమ్రా లేకుండా విజయాలు సాధించడం ఎలా ? అని కంగారు పడ్డారు. అయితే బుమ్రా గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న యువ బౌలర్లు అర్షదీప్ సింగ్, మావి, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్ ,శార్ధూల్ ఠాకూర్ లు అవకాశాలను రెండుచేతులతోనూ అంది పుచ్చుకుని జట్టులో సెటిల్ అయిపోయారు. ఇపుడు బుమ్రా, షమీ వంటి బౌలర్లు జట్టులోకి రావడానికి ఫిట్ గా ఉన్నా కూడా వారికి వెంటనే స్థానం దక్కుతుందని గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. యువ ఆటగాళ్లు అంతలా ఎదిగిపోయి భారత్ ను విజయాల బాటలో పరుగులు పెట్టిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment