
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఒకొక్కరిగా జట్టుతో కలుస్తున్నారు. 17వ సీజన్ కోసం ఆటగాళ్లు తమ ప్రీ ట్రైనింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్‌ను బహుకరించడం అనావాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే ఈ క్యాప్‌తో పాటు ప్రైజ్ మనీని కూడా అందజేస్తారు. అయితే ఈ ధనాధన్ లీగ్‌లో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? మీరు ఆలోచించండి? మీకు సమాధానం తెలియకపోతే మేమే చెప్పేస్తాం.
ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న మొట్టి మొదటి భారత ఆటగాడు ఎవరో కాదు టీమిండియా క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ సారథి సచిన్ టెండూల్కర్. 2010 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున సచిన్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్‌లో మాస్టర్ బ్లాస్టర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 618 పరుగులతో లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దీంతో అతడికి ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఇక సచిన్ తర్వాత ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న రెండో ఇండియన్ రాబిన్ ఉతప్ప. 2014 సీజన్‌లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించిన ఉతప్ప.. 660 పరుగులతో ఆరెంజ్‌క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మరి ఈసారి ఎవరు ఆరెంజ్‌క్యాప్‌ను గెలుచుకుంటారో వేచి చూడాలి.