టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు ఇకపై గట్టి పోటీతప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే రుతురాజ్ గైక్వాడ్ కంటే మెరుగ్గా ఆడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఈ పంజాబీ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆరంభిస్తూ వస్తున్నాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముఖ్యంగా టీ20లకు రోహిత్ దూరమైన కారణంగా.. యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌కు అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం దక్కింది.
అయితే, గిల్ పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో లేనపుడు రుతురాజ్ గైక్వాడ్ టీ20 జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ ముంబై బ్యాటర్ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
స్వదేశంలో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 55.75 సగటు, 159.28 స్ట్రైక్‌రేటుతో మొత్తంగా 223 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఖాతాలో ఓ వేగవంతమైన సెంచరీ కూడా ఉంది. ఇక ఈ సిరీస్‌ను 4-1తో టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఐదో టీ20లో విజయానంతరం ఆకాశ్ చోప్రా..రుతురాజ్ గైక్వాడ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రుతురాజ్ గైక్వాడ్... నేను కూడా రేసులో ఉన్నాను అని గట్టిగా చెబుతున్నాడు.
శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌కు మధ్య ఓపెనింగ్ స్థానం కోసం ఇకపై గట్టి పోటీ ఉంటుంది. రోహిత్ శర్మ వచ్చాడంటే ఇక చెప్పేదేముంది? ఈ ముగ్గురిలో ఇద్దరిని ఎంచుకోవాలంటే అదెంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాబట్టి.. రుతురాజ్ ఈ సిరీస్‌లో ఆడిన మాదిరే రానున్న మ్యాచ్‌లలోనూ పరుగులు రాబట్టాలి. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. కాబట్టి ఆ జట్టులో చోటు దక్కించుకోవాలంటే రుతు ఫామ్‌ను కొనసాగించాలి.
అప్పుడు రుతురాజ్- శుబ్‌మన్ గిల్ మధ్య షూటౌట్ తప్పదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండబోతోంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. యశస్వి జైశ్వాల్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని కొనియాడాడు.
చదవండి: విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం.. ఏకైక క్రికెటర్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment