IPL 2023 Qualifier 1, GT Vs CSK: Chennai Super Kings Beat Gujarat Titans By 15 Runs - Sakshi
Sakshi News home page

చెన్నై ‘విజిల్‌పొడు’

Published Wed, May 24 2023 2:57 AM | Last Updated on Wed, May 24 2023 8:47 AM

MS Dhoni and Co beat Gujarat by 15 runs - Sakshi

చెన్నై వేదిక, ధోని కెప్టెన్సీ అంటే ఎంత చిన్న లక్ష్యమైనా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యమే! నెమ్మదైన చెపాక్‌ మైదానంలో ఇది మరోసారి కనిపించింది. రెండు రోజుల క్రితం బెంగళూరులో చెలరేగిన జట్టును ధోని తన వ్యూహాలతో కట్టిపడేశాడు. కీలక సమరంలో తన జట్టును గెలిపించి పదోసారి ఫైనల్లోకి చేర్చి అభిమానులతో ఈల (విజిల్‌పొడు) కొట్టించాడు. 173 పరుగులను అందుకోలేక లీగ్‌ టాపర్,  డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ బోల్తా పడింది.

అద్భుత ఫామ్‌లో ఉన్న టీమ్‌ సమష్టి వైఫల్యంతో తమ రెండు సీజన్ల చరిత్రలో తొలిసారి ఆలౌట్‌ అయింది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) ఐదో టైటిల్‌ వేటకు సిద్ధం కాగా... గుజరాత్‌కు రెండో క్వాలిఫయర్‌ రూపంలో మరో అవకాశం మిగిలి ఉంది. ముంబై, లక్నో జట్ల మధ్య నేడు జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో టైటాన్స్‌ తలపడుతుంది.   

చెన్నై: ఐపీఎల్‌లో సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్‌గా భావిస్తున్న పోరును ధోని చక్కటి విజయంతో ముగించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌–1 మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సూపర్‌ కింగ్స్‌ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 15 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్‌) డెవాన్‌ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.  

ఓపెనర్లు మినహా... 
ఓపెనర్లు రుతురాజ్, కాన్వే తమ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి చెన్నైకి శుభారంభం అందించారు. ఈ క్రమంలో 2 పరుగుల వద్ద రుతురాజ్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. తాజా సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన యువ పేసర్‌ దర్శన్‌ నల్కండే తన మూడో బంతికే రుతురాజ్‌ను అవుట్‌ చేసి సంబరం చేసుకున్నాడు.

అయితే అది ‘నోబాల్‌’ కావడంతో బతికిపోయిన రుతురాజ్‌ వరుస బంతుల్లో 6, 4 బాది జోరును ప్రదర్శించగా, కాన్వే కాస్త జాగ్రత్తగా ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 6 ఫోర్లు, సిక్స్‌తో 49 పరుగులు చేయగలిగింది. 36 బంతుల్లో రుతురాజ్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 87 పరుగుల (64 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యం తర్వాత 11వ ఓవర్లో మొదటి వికెట్‌ తీయడంలో గుజరాత్‌ సఫలమైంది.

రుతురాజ్‌ను షమీ అవుట్‌ చేయగా, తర్వాతి ఓవర్లోనే దూబే (2)ను నూర్‌ వెనక్కి పంపాడు. మూడు బంతుల వ్యవధిలో రహానే (17), కాన్వే పెవిలియన్‌ చేరగా, అంబటి రాయుడు (17) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. చివర్లో జడేజా (16 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త ధాటిగా ఆడాడు.  

సమష్టి వైఫల్యం... 
ఛేదన దిశగా ఏ దశలోనూ గుజరాత్‌ అడుగులు సరిగా పడలేదు. గిల్‌ కొద్దిగా ప్రతిఘటించినా, మిగతావారంతా పూర్తిగా విఫలమయ్యారు. సాహా (12) ఆరంభంలోనే వెనుదిరగ్గా, కెప్టెన్‌ హార్దిక్‌ (8) తన వైఫల్యాలను కొనసాగించాడు. చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రావడం గగనంగా మారింది.

10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 72 పరుగులు కాగా... విజయం కోసం చివరి పది ఓవర్లలో 101 పరుగులు చేయాల్సిన స్థితిలో టైటాన్స్‌ నిలిచింది. దాంతో గిల్, మిల్లర్‌ (4)లపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుట్‌ కావడంతో మ్యాచ్‌ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది. 

‘సున్నా’కు 500 మొక్కలు చొప్పున... 
ఈ మ్యాచ్‌లో బౌలర్‌ పరుగు ఇవ్వకుండా ‘డాట్‌ బాల్‌’ వేసిన సమయంలో టీవీ స్కోరు బోర్డులో సున్నాకు బదులుగా ఒక పచ్చని మొక్క చూపిస్తూ వచ్చారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. బీసీసీఐ, ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌ టాటా కలిసి ‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రతీ డాట్‌ బాల్‌కు బీసీసీఐ 500 చొప్పున మొక్కలు నాటాలని ఒట్టు వేసుకున్నాయి! ఇది నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకూ వర్తిస్తుంది. తొలి క్వాలిఫయర్‌ చెన్నై ఇన్నింగ్స్‌లో 34 డాట్‌ బాల్స్, గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో 50 డాట్‌ బాల్స్‌ ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్‌కు సంబంధించి మొత్తం 42,000 మొక్కలు నాటబోతున్నారు.   

10  ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో చెన్నై సూపర్‌  కింగ్స్‌ జట్టు పదోసారి ఫైనల్‌ చేరింది. నాలుగుసార్లు విజేతగా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 

1 గత ఏడాది కొత్త జట్టుగా ఐపీఎల్‌లోకి వచ్చి విజేతగా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ ఈ టోర్నీ మొత్తంలో తొలిసారి ఓ మ్యాచ్‌లో ఆలౌట్‌ కావడం గమనార్హం. 

ఇప్పటి వరకు చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య నాలుగు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగ్గా... నాలుగు మ్యాచ్‌ల్లోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఒక్కడే అర్ధ సెంచరీ సాధించడం విశేషం. 

1 ఐపీఎల్‌ టోర్నీలో గతంలో గుజరాత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన చెన్నై తొలిసారి గెలి చింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌లో నెగ్గిన గుజరాత్‌ నాలుగోసారి చేతులెత్తేసింది.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ శర్మ 60; కాన్వే (సి) రషీద్‌ (బి) షమీ 40; దూబే (బి) నూర్‌ 1; రహానే (సి) గిల్‌ (బి) నల్కండే 17; రాయుడు (సి) షనక (బి) రషీద్‌ 17; జడేజా (బి) షమీ 22; ధోని (సి) పాండ్యా (బి) మోహిత్‌ శర్మ 1; మొయిన్‌ అలీ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–87, 2–90, 3–121, 4–125, 5–148, 6–155, 7–172. బౌలింగ్‌: షమీ 4–0–28–2, దర్శన్‌ నల్కండే 4–0–44–1, రషీద్‌ ఖాన్‌ 4–0–37–1, నూర్‌ అహ్మద్‌ 4–0–29–1, మోహిత్‌ శర్మ 4–0–31–2.  

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) పతిరణ (బి) చహర్‌ 12; గిల్‌ (సి) కాన్వే (బి) చహర్‌ 42; పాండ్యా (సి) జడేజా (బి) తీక్షణ 8; షనక (సి) తీక్షణ (బి) జడేజా 17; మిల్లర్‌ (బి) జడేజా 4; విజయ్‌శంకర్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 14; తెవాటియా (బి) తీక్షణ 3; రషీద్‌ (సి) కాన్వే (బి) తుషార్‌ 30; నల్కండే (రనౌట్‌) 0; నూర్‌ (నాటౌట్‌) 7;  షమీ (సి) చహర్‌ (బి) పతిరణ 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 157. వికెట్ల పతనం: 1–22, 2–41, 3–72, 4–88, 5–88, 6–98, 7–136, 8–136, 9–142, 10–157. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–29–2, తుషార్‌ దేశ్‌పాండే 4–0–43–1, తీక్షణ 4–0–28–2, జడేజా 4–0–18–2, పతిరణ 4–0–37–2.  

ఐపీఎల్‌లో నేడు (ఎలిమినేటర్‌)
ముంబై  Vs లక్నో (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement