ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా ఐపీఎల్ సీజన్‌లో ఫామ్‌లోకి వచ్చేసింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై... వరుసగా రెండో విజయంతో ప్రత్యర్థి జట్లకు ప్రమాద సంకేతాలు పంపించింది. సొంత మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇషాన్, సూర్య, తిలక్ వర్మ ధనాధన్ ఆటతో చెలరేగడంతో 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 14 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. అంతకుముందు కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసినా చివరకు అతని వీరోచిత ప్రదర్శన వృథా అయింది.
ముంబై: లక్ష్యం పెద్దదైనా... ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ముంబై ఇండియన్స్ అనుకున్న ఫలితం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అస్వస్థతతో ముంబై జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగకపోవడంతో సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన సూర్య ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) ముంబై బౌలర్లను చితగ్కొట్టి సెంచరీ చేశాడు. అనంతరం ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించి గెలిచింది. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. రోహిత్ శర్మ (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (13 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గతంలో సచిన్ కూడా ముంబై ఇండియన్స్ తరఫునే ఆడటంతో ఐపీఎల్ టోర్నీ ఆడిన తండ్రీ, కొడుకులుగా సచిన్, అర్జున్ గుర్తింపు పొందారు. ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ దువాన్ జాన్సెన్ కూడా అరంగేట్రం చేశాడు. దువాన్ కవల సోదరుడు మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడు తున్నాడు. ఐపీఎల్‌లో ఆడిన తొలి కవల సోదర ద్వయంగా మార్కో, దువాన్ గుర్తింపు పొందింది.
ఆరంభం నుంచే...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు బౌలర్ మెరిడిత్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన రోహిత్ శర్మ, మరో ఓపెనర్ ఇషాన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. శార్దుల్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ 4,4,6 బాదగా... మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ 4, ఇషాన్ 4,6తో చెలరేగగా... 17 పరుగులు వచ్చాయి. నరైన్ నాలుగో ఓవర్లో రోహిత్, ఇషాన్ ఏకంగా 22 పరుగులు రాబట్టారు. దాంతో ముంబై 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 57/0తో నిలిచింది.
స్పిన్నర్ సుయశ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన రోహిత్ అదే ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు. అనంతరం ఇషాన్‌తో సూర్య జతకలిశాడు. వీరిద్దరు అదే జోరును కొనసాగించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 72/1తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఏడో ఓవర్లో రెండో బంతిని సిక్స్‌గా మలిచిన ఇషాన్ తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 90/2తో గెలుపుదిశగా సాగింది. ఇషాన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చి న తిలక్, సూర్యతో కలిసి ముంబైను ముందుకు నడిపించారు.
ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్లో సూర్య రెండు సిక్స్‌లు కొట్టాడు. రసెల్ వేసిన 13వ ఓవర్లో సూర్య, తిలక్ 17 పరుగులు సాధించారు. ముంబై 13 ఓవర్లకే 147/2తో విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. సుయశ్ వేసిన 14వ ఓవర్లో తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. క్రీజులో వచ్చి న టిమ్ డేవిడ్. రెండు సిక్స్‌లతో తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ముంబై గెలుపునకు 10 పరుగులు ఉన్నాయనగా సూర్య.. ఆ తర్వాత వధేరా అవుటైనా టిమ్ డేవిడ్ మిగతా పనిని పూర్తి చేశాడు.
2008 తర్వాత...
అంతకుముందు వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో 2008 ఐపీఎల్ తొలి సీజన్ తర్వాత మళ్లీ ఈ టోర్నీ లో కోల్‌కతా బ్యాటర్ సెంచరీని నమోదు చేయడం విశేషం. 2008లో బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ (158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్స్‌లు) భారీ సెంచరీ చేశాడు.
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరోవైపు వెంకటేశ్ ఒక్కడే పోరాటం చేశాడు. ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టాడు. 49 బంతుల్లో అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మెరిడిత్ బౌలింగ్‌లో స్కూప్ షాట్ కొట్టిన వెంకటేశ్ షార్ట్ థర్డ్‌మ్యాన్ వద్ద జాన్సెన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) జాన్సెన్ (బి) చావ్లా 8; జగదీశన్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) జాన్సెన్ (బి) మెరిడిత్ 104; నితీశ్ రాణా (సి) రమణ్‌దీప్ సింగ్ (సబ్) (బి) షోకీన్ 5; శార్దుల్ ఠాకూర్ (సి) తిలక్ వర్మ (బి) షోకీన్ 13; రింకూ సింగ్ (సి) నేహల్ వధేరా (బి) జాన్సెన్ 18; రసెల్ (నాటౌట్) 21; నరైన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–11, 2–57, 3–73, 4–123, 5–159, 6–172. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2–0–17–0, కామెరాన్ గ్రీన్ 2–0–20–1, దువాన్ జాన్సెన్ 4–0–53–1, పీయూష్ చావ్లా 4–0–19–1, హృతిక్ షోకీన్ 4–0–34–2, మెరిడిత్ 4–0–40–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఉమేశ్ యాదవ్ (బి) సుయశ్ 20; ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) గుర్బాజ్ (బి) శార్దుల్ 43; తిలక్ వర్మ (బి) సుయశ్ 30; టిమ్ డేవిడ్ (నాటౌట్) 24; నేహల్ వధేరా (సి) గుర్బాజ్ (బి) ఫెర్గూసన్ 6; గ్రీన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–65, 2–87, 3–147, 4–176, 5–184. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–0, శార్దుల్ ఠాకూర్ 2–0–25–1, సునీల్ నరైన్ 3–0–41–0, సుయశ్ శర్మ 4–0–27–2, వరుణ్ చక్రవర్తి 4–0–38–1, ఫెర్గూసన్ 1.4–0–19–1, రసెల్ 1–0–17–0.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు vs చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment