ఢిల్లీ ధమాకా... | Mumbai Indians lost by 29 runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ధమాకా...

Published Wed, Mar 6 2024 4:27 AM | Last Updated on Wed, Mar 6 2024 4:27 AM

Mumbai Indians lost by 29 runs - Sakshi

జెమీమా, మెగ్‌ లానింగ్‌ మెరుపులు

29 పరుగులతో ఓడిన ముంబై ఇండియన్స్‌

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ రెండో సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై మొదలైన రెండో అంచె పోటీలో ఢిల్లీ గర్జించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ ఓడించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 8 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీస్కోరు చేసింది.

మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (33 బంతుల్లో 69 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. కేవలం 27 బంతుల్లోనే ఆమె అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. ఓపెనర్, కెపె్టన్‌ మెగ్‌ లానింగ్‌ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడింది. లానింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో కాసేపే ఉన్నా మెరిపించింది. దీంతో ఢిల్లీ పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసింది.

డెత్‌ ఓవర్లలో జెమీమా చెలరేగడంతో భారీస్కోరు సాధ్యమైంది. ముంబై బౌలర్లు షబ్నిమ్, సైకా ఇషాక్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్లు జెస్‌ జొనాసెన్‌ (3/21), మరిజాన్‌ కాప్‌ (2/37), శిఖా పాండే (1/27), టిటాస్‌ సాధు (1/23) ముంబైను కట్టడి చేశారు. ఒకదశలో ముంబై 68/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది.

టాపార్డర్‌లో హేలీ మాథ్యూస్‌ (17 బంతుల్లో 29; 6 ఫోర్లు) మినహా ఆ తర్వాత వరుసగా యస్తిక భాటియా (6), నట్‌ సీవర్‌ (5), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (6) నిరాశపరిచారు. లోయర్‌ ఆర్డర్‌లో అమన్‌జోత్‌ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement