బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌ను డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయంతో మొదలు పెట్టింది. గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (53 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్మెగ్ లానింగ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
సివర్ బ్రంట్, అమేలియా కెర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా... తొలిసారి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడిన దక్షిణాఫ్రికా పేసర్ షబ్నమ్ ఇస్మాయిల్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యస్తిక భాటియా (45 బంతుల్లో 57; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.
ఆఖరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. 4 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి హర్మన్ అవుటైనా...చివరి బంతి ముంబై విజయానికి 5 పరుగులు అవసరంకాగా.. సజన సిక్సర్‌గా మలిచి ముంబైను గెలిపించింది.
క్యాప్సీ అర్ధసెంచరీ...
షఫాలీ వర్మ (1) ఆరంభంలోనే వెనుదిరగ్గా... లానింగ్, జెమీమాలతో రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి క్యాప్సీ జట్టును ఆదుకుంది. 10 ఓవర్లలో జట్టు 65 పరుగులు చేయగా లానింగ్‌ను బ్రంట్ అవుట్ చేయడంతో 64 పరుగుల (51 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం హేలీ మాథ్యూస్ ఓవర్లలో 2 సిక్స్‌లు, ఫోర్ బాదిన క్యాప్సీ 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది.
క్యాప్సీతో పాటు క్రీజ్‌లో ఉన్నంత సేపు జెమీమా దూకుడుగా ఆడటంతో మూడో వికెట్‌కు 40 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా...కెర్ వేసిన చివరి ఓవర్లో 3 ఫోర్లు కొట్టి మరిజాన్ కాప్ (16 నాటౌట్) కీలక పరుగులు జోడించింది.
కీలక భాగస్వామ్యం...
ఛేదనలో రెండో బంతికే హేలీ మాథ్యూస్ (0) అవుట్ కాగా, అయితే కాప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో సివర్ బ్రంట్ (19) ధాటిని ప్రదర్శించింది. మరో ఎండ్‌లో యస్తిక చక్కటి ఇన్నింగ్స్‌కు హర్మన్ అండగా నిలిచింది. శిఖా పాండే ఓవర్లో యస్తిక కొట్టిన 2 ఫోర్లు, 2 సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.
రాధ బౌలింగ్‌తో భారీ సిక్స్‌తో 35 బంతుల్లో యస్తిక హాఫ్ సెంచరీని అందుకుంది. యస్తిక, హర్మన్ రెండో వికెట్‌కు 56 పరుగులు జత చేసిన తర్వాత అరుంధతి ఈ జోడీని విడదీసింది. అయితే హర్మన్, అమేలియా కెర్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు) దూకుడైన భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. చివర్లో కొంత ఉత్కంఠ ఎదురైనా...ముంబై గెలుపు తీరం చేరింది.
ఆటా మాటా...
తొలి మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ల ప్రదర్శనతో డబ్ల్యూపీఎల్ అట్టహాసంగా మొదలైంది. కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా వేర్వేరు పాటలకు డ్యాన్స్‌లు చేసి అలరించారు. అనంతరం షారుఖ్ ఖాన్ ఐదుగురు కెపె్టన్లను పరిచయం చేయగా... వారంతా ప్రత్యేక రథాల్లో వేదిక వద్దకు వచ్చి ట్రోఫీని ఆవిష్కరించారు.
నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment