మహిళల లీగ్‌కు వేళాయె.. తొలి మ్యాచ్‌లో ముంబై వర్సెస్‌ ఢిల్లీ | Womens Premier League from today | Sakshi
Sakshi News home page

WPL 2024: మహిళల లీగ్‌కు వేళాయె.. తొలి మ్యాచ్‌లో ముంబై వర్సెస్‌ ఢిల్లీ

Published Fri, Feb 23 2024 4:19 AM | Last Updated on Fri, Feb 23 2024 6:56 AM

Womens Premier League from today - Sakshi

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది తొలి సీజన్‌లో అభిమానులను ఆకట్టుకొని పలువురు యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చిన ఈ లీగ్‌ మరోసారి అదే స్థాయిలో ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌ లో గత సీజన్‌ విజేత ముంబై ఇండియన్స్‌తో రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతుంది.

మిగతా మూడు జట్లు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియల్స్, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మార్చి 17న ఢిల్లీ వేదికగా ఫైనల్‌ జరుగుతుంది.  

తాజా సీజన్‌ విశేషాలు.... 
♦ గత సీజన్‌లో ఒక్క ముంబైలోనే అన్ని మ్యాచ్‌ లు జరిగాయి. ఈసారి బెంగళూరు, ఢిల్లీలను వేదికలుగా ఎంపిక చేశారు.   
♦  తొలి సీజన్‌లాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో తలపడతాయి. 
♦ గత ఏడాది ఐదు టీమ్‌లకు కెపె్టన్లుగా వ్యవహరించిన వారే ఈసారి సారథులుగా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన మెగ్‌ లానింగ్‌ (ఢిల్లీ), అలీసా హీలీ (యూపీ), బెత్‌ మూనీ (గుజరాత్‌) ఆ్రస్టేలియన్లే కాగా...హర్మన్‌ప్రీత్‌ (ముంబై), స్మృతి మంధాన (బెంగళూరు) భారత స్టార్లు. భారత్‌ మినహా ఆసీస్‌ నుంచే గరిష్టంగా 13 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు.  
♦ 2023 సీజన్‌లో సత్తా చాటిన సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్‌ ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యారు. గత ఏడాది వీరిని కనీస ధర రూ.10 లక్షలకు తీసుకోగా... రెండు సీజన్ల మధ్య భారత జట్టుకు ఆడటంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరికి రూ. 30 లక్షల చొప్పున లభిస్తాయి. 
♦ ఈ సీజన్‌ వేలంలో కాశ్వీ గౌతమ్‌ను రూ.2 కోట్లకు గుజరాత్‌ జెయింట్స్‌ టీమ్‌ ఎంచుకుంది. అయితే గాయం కారణంగా ఆమె ఈ సీజన్‌ నుంచి అనూహ్యంగా తప్పుకోవడం గమనార్హం.  
♦ హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి 8 మంది ఈసారి డబ్ల్యూపీఎల్‌లో బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్‌ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ఢిల్లీ), త్రిష పూజిత (గుజరాత్‌), యషశ్రీ, గౌహర్‌ సుల్తానా (యూపీ) జట్లకు... ఆంధ్ర క్రికెటర్లు స్నేహ దీప్తి (ఢిల్లీ), సబ్బినేని మేఘన (బెంగళూరు), షబ్నమ్‌ (గుజరాత్‌), అంజలి శర్వాణి (యూపీ) టీమ్‌ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement