Nepal's Aasif Sheikh has won Spirit of Cricket Award for the special moment - Sakshi
Sakshi News home page

ఇది కదా క్రికెటింగ్‌ స్పిరిట్‌ అంటే.. అవకాశం దొరికినా..!

Mar 21 2023 4:30 PM | Updated on Mar 21 2023 4:46 PM

Nepal Aasif Sheikh Has Won Spirit Of Cricket Award For The Special Moment - Sakshi

నేపాల్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ షేక్‌ 2022 సంవత్సరానికి గాను క్రిస్టఫర్‌ జెన్కిన్స్‌ మార్టిన్‌ (CJM) స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) 2023 మార్చి 21న ప్రకటించింది. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన ఆసిఫ్‌ 2022 ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్‌ చేసే అవకాశం వచ్చినా ఔట్‌ చేయకుండా వదిలిపెట్టడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. తన చర్య వల్ల జెంటిల్మెన్‌ గేమ్‌ యొక్క ప్రతిష్ఠను పెంచినందుకు గాను ఆసిఫ్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు కూడా దక్కింది. 

అసలేం జరిగిందంటే.. 2022 ఫిబ్రవరిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కమల్‌ సింగ్‌ వేసిన 19వ ఓవర్‌ మూడో బంతిని ఐర్లాండ్‌ బ్యాటర్‌ మార్క్‌ అదైర్‌ భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదైర్‌ కొట్టిన షాట్‌ అతనికి కాళ్లకే తాకి లెగ్‌సైడ్ దిశగా వెళ్లింది. బౌలర్‌ బంతి కోసం పరుగు పెట్టే క్రమంలో నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను పిచ్‌ మధ్యలో కింద పడిపోయాడు. మెక్‌బ్రైన్‌ లేచి పరుగు పూర్తి చేసే లోపు బౌలర్‌ బంతిని వికెట్‌కీపర్‌ ఆసిఫ్‌కు చేరవేయగా, అతను రనౌట్ చేయడమే తరువాయి అని అంతా అనుకున్నారు.

అయితే, తమ బౌలర్‌ ఢీకొట్టడం వల్లనే మెక్‌బ్రైన్‌‌ కిందపడి రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడని భావించిన ఆసిఫ్‌.. అతన్ని రనౌట్‌ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో మెక్‌బ్రైన్‌ విజయవంతంగా పరుగు పూర్తి చేయగలిగాడు. ఆ సమయంలో ఆసిఫ్‌ చూపిన క్రీడాస్పూర్తికి యావత్‌ క్రీడాప్రపంచం జేజేలు పలికింది. క్రికెట్‌ విశ్లేషకులు ఆసిఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ నిర్ణీత ఓవరల్లో 127 చేయగా.. ఛేదనలో నేపాల్‌ 111 పరుగులకు మాత్రమే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మ్యాచ్‌ అనంతరం ఆసిఫ్‌ మాట్లాడుతూ.. మెక్‌బ్రైన్‌ను రనౌట్‌ చేసి ఉంటే తాము గెలిచే వాళ్లమో లేదో తెలీదు, అతన్ని ఔట్‌ చేసుంటే మాత్రం క్రీడాస్పూర్తి అనే మాటకు అర్ధం లేకుండా పోయేది అంటూ మెచ్యూర్డ్‌ కామెంట్స్‌ చేశాడు.

కాగా, సీజేఎమ్‌ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు కోసం ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్లు, టెస్ట్‌ జట్ల కెప్టెన్లు జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ కూడా పోటీపడ్డారు. 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని మాథ్యూ వేడ్‌ ఔట్‌ అయినప్పటికీ బట్లర్‌ అప్పీల్‌ చేయకుండా వదిలిపెట్టాడు. బెన్‌ స్టోక్స్‌ విషయానికొస్తే.. పాక్‌పై సిరీస్‌ విక్టరీ అనంతరం స్టోక్స్‌.. యువ ఆటగాడు రెహాన్‌ అహ్మద్‌కు ట్రోఫీ అందించి క్రీడాస్పూర్తిని చాటాడు. అలాగే ఈ సిరీస్‌ ఆడటం ద్వారా తనకు వచ్చే పారితోషికం మొత్తాన్ని పాక్‌లో వరద బాధితులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement