ఇటీవల పాక్‌పై టెస్టు సిరీస్ నెగ్గిన సందర్భంగా న్యూజిలాండ్ జట్టు
దుబాయ్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు మరో ‘ఫైనల్’ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కివీస్ అర్హత సాధించింది. కరోనా నేపథ్యంలో పలు టెస్టు సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా జట్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా కాకుండా... ఆడిన టెస్టుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటూ దాని ద్వారా వచ్చిన పాయింట్ల శాతం ఆధారంగా ఐసీసీ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ పాయింట్ల శాతం 70 కాగా... ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడం కివీస్ జట్టుకు కలిసొచ్చింది. ఫలితంగా అందరికంటే ముందుగా ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత పొందింది.
ఇతర జట్లలో ఒకరికి మాత్రమే కివీస్ పాయింట్ల శాతాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి విలియమ్సన్ సేన ఫైనల్ చేరడం ఖాయమైంది. ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఎవరు తలపడతారనేది భారత్–ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత అధికారికంగా ఖరారవుతుంది. అంకెలపరంగా చూస్తే పేరుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా పోటీలో ఉన్నా... ప్రస్తుత ఫామ్, వాస్తవికంగా చూస్తే ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం దాదాపు ఖాయమే. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత్ కనీసం 2–1తో గెలిచినా సరిపోతుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. జూన్ 23ను రిజర్వే డేగా కేటాయించారు. 2019 జులై 14న లార్డ్స్ మైదానంలోనే జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ‘బౌండరీ కౌంట్’ ద్వారా ఇంగ్లండ్ చేతిలో ఓడింది.
మరో బెర్త్ కోసం మూడు జట్లు...
భారత్: ప్రస్తుతం 71.7 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉంది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వెనక్కి నెట్టి భారత్ ఫైనల్ చేరాలంటే నాలుగు టెస్టుల ద్వారా మరో 70 పాయింట్లు రావాలి. అంటే కోహ్లి బృందం కనీసం 2–1 తేడాతో ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిస్తే చాలు. 3–0 లేదా 3–1 లేదా 4–0తో గెలిస్తే మరీ మంచిది.
ఇంగ్లండ్: ప్రస్తుతం 68.7 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో ఉంది. భారత్, ఆ్రస్టేలియా శాతాన్ని ఇంగ్లండ్ దాటాలంటే ఆ జట్టుకు మరో 87 పాయింట్లు కావాలి. అంటే కనీసం ఆ జట్టు భారత్‌పై 3 టెస్టులు గెలవాలి. అంటే 3–0 లేదా 4–0 లేదా 3–1తో టీమిండియాను ఓడించాలి. ఎలా చూసినా ఇది అసాధ్యమే!
ఆస్ట్రేలియా: ప్రస్తుతం 69.2 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంకా బరి నుంచి పూర్తిగా తప్పుకోలేదు. జూన్‌లోపు ఎలాంటి టెస్టులు లేకపోవడంతో ఆస్ట్రేలియా శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ఆసీస్ ముందుకెళ్లాలంటే మాత్రం భారత్ 1–0తో ఇంగ్లండ్‌పై గెలవాలి. లేదంటే ఇంగ్లండ్ 1–0 లేదా 2–0 లేదా 2–1తో సిరీస్ నెగ్గాలి. లేదంటే భారత్–ఇంగ్లండ్ సిరీస్ ‘డ్రా’ గా ముగియాలి (తేడాతో సంబంధం లేకుండా). అప్పుడే ఆ్రస్టేలియాకంటే భారత్, ఇంగ్లండ్ శాతం తక్కువ అవుతుంది. ఆసీస్ ఫైనల్‌కు చేరుతుంది.
దక్షిణాఫ్రికాకు వెళ్లలేం...
మెల్‌బోర్న్: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సిన ఆ్రస్టేలియా జట్టు ఆ పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి తేదీలు కూడా ప్రకటించకపోవడంతో ఈ టెస్టు సిరీస్ దాదాపుగా రద్దయినట్లే. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ టూర్ కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించిన కంగారూ టీమ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అదే కారణమా...
అయితే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు విషయంలో కరోనాకంటే కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో రబడ, నోర్జే, ఇన్‌గిడిలాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదు. మరొక్క సిరీస్ ఓడినా టీమ్ మేనేజ్‌మెంట్‌లో సమూల మార్పులు ఖాయమనే భావన అందరిలో ఉండటమే వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. కరోనా కాలంలోనూ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆతిథ్య మిచ్చింది. ఇరు జట్ల మధ్య బయో బబుల్‌లో రెండు టెస్టులు జరిగాయి. అవే ఏర్పాట్లు ఇప్పుడు చేయడం కూడా కష్టం కాదు. మరో వైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పర్యటన కూడా సాఫీగా కొనసాగుతోంది.
పాపం ఆసీస్!
ఆ్రస్టేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలకు భారత్‌తో సిరీస్ సందర్భంగా దెబ్బ పడింది. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానాతో పాటు ఐసీసీ నాలుగు పాయింట్ల కోత కూడా విధించింది. అది జరగకపోయి ఉంటే ఆ్రస్టేలియా కూడా న్యూజిలాండ్‌తో సమంగా 70 పాయింట్ల శాతంతో ఉండేది. అప్పుడు ఒక్కో వికెట్‌కు చేసిన పరుగులు, ఇచ్చిన పరుగుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అంశంలో కివీస్ (1.28) కంటే మెరుగ్గా ఉన్న ఆసీస్ (1.39)కు మంచి అవకాశం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment