దుబాయ్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిబంధనావళిని అతిక్రమించిన సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే చివరి రెండు వన్డేలు, రెండు టీ20లకు దూరమవనున్నాడు. దీంతో పాక్ సీనియర్ ఆటగాడు షోయాబ్ మాలిక్ తాత్కాలిక సారథిగా వ్యహరించనున్నాడు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా గానీ, కుటుంబం సభ్యులపై గానీ, వర్ణ, జాతి వివక్షలు, అంపైర్లపై అసహనాన్ని ప్రదర్శిచడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని పేర్కొంది. (‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’)
అసలేం జరిగిందంటే..?
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో క్రీడా సూర్తిని మరిచి పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడటం స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. (పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!)
దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment