సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మను ఎంపిక చేయడంతో అధ్యక్ష, కార్యదర్శి వర్గాల మధ్య వచ్చిన విభేదాల అంకం కీలక మలుపు తీసుకుంది. ఈ విషయంలో కార్యదర్శి విజయానంద్ తదితరులపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్‌దే పైచేయి అయింది. తమకు తెలీకుండా, తమ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అజహర్ ఏకపక్షంగా అంబుడ్స్‌మన్‌ను నియమించారని, అది చెల్లదంటూ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా దీపక్ వర్మ దీనిపై స్పందించారు. అంద రి అనుమతితోనే గత జూన్‌లోనే తనను ఎంపిక చేసినట్లు, ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు వర్మ నేరుగా లేఖ రాశారు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!)
తన నియామకాన్ని మళ్లీ ప్రశ్నిస్తే న్యాయపరంగా తగిన చర్య తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ‘హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు చేపట్టాలని కార్యదర్శి విజయానంద్ నాకు స్వయంగా లేఖ రాయడంతో నేను అంగీరిస్తున్నట్లు బదులిచ్చాను. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయాల అవసరం ఉంది కాబట్టి జూన్ 6న జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. పైగా ప్రభుత్వ నిబంధనల కారణంగా ఏజీఎం ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా నన్ను నియమించేసి ఆ తర్వాత అంతా చక్కబడిన తర్వాతైనా అధికారికంగా ఆమోద ముద్ర వేయవచ్చని కూడా అదే సమావేశంలో స్పష్టం చేశారు. దీనికి హాజరైన సభ్యులంతా అంగీకారం తెలిపారే తప్ప ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. అంబుడ్స్‌మన్‌గా నా నియమాకంలో ఎలాం టి అక్రమమూ జరగలేదు. అపాయింట్‌మెంట్ లెటర్‌పై సంతకం లేకుండా ఉండటం పెద్ద సమస్య కాదు. పైగా నాడు అంగీకారం తెలిపిన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. మళ్లీ దానిని తప్పుగా చూపిస్తూ ఏవైనా లేఖలు రాస్తే వారిపై చర్య తీసుకుంటాం’ అని దీపక్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. వర్మ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ సంఘానికి కూడా అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment