వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే? | ICC ODI World Cup Trophy History; How Much It Costs? | Sakshi
Sakshi News home page

ODI World Cup 2023: వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే?

Published Fri, Sep 22 2023 10:12 AM | Last Updated on Tue, Oct 3 2023 7:25 PM

ODI Cricket World Cup Trophies History - Sakshi

వన్డే ప్రపంచకప్‌.. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ వరల్డ్‌కప్‌ ​ట్రోఫీని సాధించాలని ప్రతీ జట్టు కలలు కంటుంది. మొత్తం 10 జట్లు బరిలోకి దిగితే చివరకు టైటిల్‌ను ముద్దాడేది ఒకే ఒక జట్టు. వారే విశ్వవిజేతగా నిలుస్తారు. ఈ సారి ఈ మెగా టోర్నీకి భారత్‌ వేదికైంది.  పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది.

ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఢిపెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌-2023కు తెరలేవనుంది. ఈ వరల్డ్‌కప్‌కు సంబంధించిన ట్రోఫీ తాజాగా హైదరాబాద్‌లో సందడి చేసింది.  ప్రముఖ కట్టడం చార్మినార్‌, హుస్సేన్‌ సాగర్‌ వద్ద  ట్రోఫీని ఉంచి  ఐసీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు.

అనంతరం వరల్డ్‌ కప్‌లో మూడు మ్యాచ్‌లకు వేదికైన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించారు. ఈ ట్రోఫి ఇప్పటివరకు 18 దేశాలను ఈ తిరిగి వచ్చింది. ఇక వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచే జట్టుకు బహుకరించే ట్రోఫీ చరిత్ర, అది ఎవరు తయారు చేశారు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ప్రుడెన్షియల్ వరల్డ్‌కప్‌(1975)
1975లో వన్డే ప్రపంచకప్‌ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన తొలి వన్డే వరల్డ్‌కప్‌ను వెస్టిండీస్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే ఈ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ప్రుడెన్షియల్ వరల్డ్‌కప్‌ అని నామకరణం చేశారు. ఎందుకంటే ప్రుడెన్షియల్ అనే భీమా కంపెనీ తొలి వరల్డ్‌కప్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది.

మొట్టమొదటి వరల్డ్‌కప్‌ ట్రోఫీ వెండి, బంగారం కలయికతో రూపొందించబడింది. ట్రోఫీ పైబాగంలో బంగారు పూత పూసిన క్రికెట్‌ బంతిని అమర్చారు. 1979, 1983 ప్రపంచకప్‌లో కూడా ప్రుడెన్షియల్ కంపెనీనే స్పాన్సర్‌గా వ్యవహరించింది. 1979 వన్డే ప్రపంచకప్‌ను రెండో సారి విండీస్‌ కైవసం చేసుకుగా.. 1983 వరల్డ్‌కప్‌ను అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ముద్దాడింది.

రిలయన్స్‌ ట్రోఫీ(1987)..
ఇక 1987 వరల్డ్‌కప్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టైటిల్‌ స్పాన్సర్‌గా ఎంపికైంది. దీంతో ఆ ఏడాది మెగా ఈవెంట్‌ను రిలయన్స్‌ కప్‌గా పిలిచారు. రిలయన్స్‌ కూడా వెండి, బంగారం కలయికతో కప్‌ను తాయారు చేసింది. ప్రుడెన్షియల్ కంపెనీ వలే రిలయన్స్‌ కూడా ట్రోఫీ రూపకల్పనలో  క్రికెట్ బాల్‌ను చేర్చింది. ఇక ఈ మెగా టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు తొలి వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

బెన్సన్ అండ్‌ హెడ్జెస్ ప్రపంచ కప్
రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కేవలం ఒక్క వరల్డ్‌కప్‌కు మాత్రమే టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 1992 ప్రపంచకప్‌లో మరోకొత్త టైటిల్‌ స్పాన్సర్‌ పుట్టుకొచ్చింది. బెన్సన్ అండ్‌ హెడ్జెస్ అనే బ్రిటీష్‌ సిగిరేట్‌ కంపెనీ 1992 ప్రపంచకప్‌కు టైటిల్‌ను స్పాన్సర్‌ చేసింది. దీంతో ఆ ఏడాది టోర్నీని బెన్సన్ అండ్‌ హెడ్జెస్ వరల్డ్‌కప్‌ అని పిలిచారు. 1992 ప్రపంచకప్‌ పాకిస్తాన్‌ సొంతం చేసుకుంది.

విల్స్‌ వరల్డ్‌కప్‌(1996)
బెన్సన్ అండ్‌ హెడ్జెస్ కంపెనీ కూడా ఐసీసీతో తమ ప్రయాణాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. 1996 వన్డే ప్రపంచకప్‌లో విల్స్‌ అనే మరోసిగిరెట్‌ కంపెనీ టైటిల్‌ను స్పాన్సర్‌ చేసింది. దీంతో ఆ టోర్నీని విల్స్ వరల్డ్ కప్ 1996 అని పిలిచారు. ఈ విల్స్‌ వరల్డ్‌కప్‌ను శ్రీలంక ఎగరేసుకుపోయింది.

ఐసీసీ కీలక నిర్ణయం..
ఇక 1996 వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 1999 వరల్డ్‌కప్‌ కోసం ఐసీసీనే ఒక సరికొత్త ట్రోఫీని ప్రవేశపెట్టింది. ఆ ట్రోఫీని తాయారు చేసే బాధ్యత లండన్‌లోని గారార్డ్ అనే ప్రముఖ జ్యుయలరీ సంస్థకు ఐసీసీ అప్పగించింది. వరల్డ్‌కప్‌ ట్రోఫీని తయారు చేయడానికి వారికి రెండు నెలల సమయం పట్టింది. వెండితో తయారైన ఈ ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూశారు.

60 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ట్రోఫీ పైన బంగారు వర్ణంలో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబ్‌కు సపోర్ట్‌గా మూడు సిల్వర్ కాలమ్‌లు ఉంటాయి. ఈ సిల్వర్ కాలమ్‌లు స్టంప్‌లు, బెయిల్స్‌ ఆకారంలో నిలువ వరుసగా ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను ప్రతిబింబించేలా ఈ ట్రోఫీని తాయారు చేశారు. గ్లోబ్‌ క్రికెట్‌ బంతిని సూచిస్తుంది. ఈ ట్రోఫీని ప్రత్యేక కొలతతో రూపొందించారు. ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకే విధంగా ఉంటుంది. ఈ ట్రోఫీ సుమారు 11 కిలోల బరువు ఉంటుంది. 

ధర ఎంతంటే?
ఈ ట్రోఫీ తయారీకి ఐసీసీ 40వేల పౌండ్లు ఖర్చు చేసింది. అంటే ప్రస్తుత ధరల ప్రకారం దీని ధర రూ.30,85,320గా ఉంది. వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందిస్తారు. విజేత పేరును ట్రోఫీ కింద భాగాన ముద్రిస్తారు. ఒరిజినల్ ట్రోఫీని పోలిన నకలును  గెలిచిన జట్టుకు అందజేస్తారు. అసలు ట్రోఫీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్‌లోని తమ కార్యాలయంలో ఉంచుతుంది. కాగా 1999 వరల్డ్‌కప్‌ కోసం తాయారు చేసిన ట్రోఫీనే ఇప్పటకి ఐసీసీ బహుకరిస్తుంది.


చదవండి: PCA Stadium Pitch Report: ఆస్ట్రేలియా-భారత్‌ తొలి వన్డే.. రోహిత్‌ మూడో డబుల్‌ సెంచరీ ఇక్కడే! బ్యాటర్లకు పండగే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement