వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుందన్నట్టు.. ప్రఖ్యాత ఒలింపిక్స్ కూడా కేవలం ఒక చిన్న రన్నింగ్ రేస్‌తోనే ప్రారంభమైంది! ఇప్పుడు వందలాది దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. కోట్ల మంది వీక్షకులతో జపాన్‌లోని టోక్యోలో ఘనంగా క్రీడా సంగ్రామం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ చరిత్ర, ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దామా..
– సాక్షి సెంట్రల్ డెస్క్
చిన్న రన్నింగ్ రేస్‌తో మొదలై..
గ్రీకుల పురాణాల ప్రకారం.. హెరాకల్స్ చక్రవర్తి వారి దేవుడు జియస్ గౌరవార్థం మొట్టమొదటగా ఒలింపియాలో తొలి క్రీడా పోటీలు నిర్వహించాడు. లిఖిత పూర్వక ఆధారాల ప్రకారమైతే.. క్రీస్తుపూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియాలో 192 మీటర్ల పరుగు పందాలు నిర్వహించారు. కోరోబస్ అనే వంటవాడు అందులో గెలిచి.. మొదటి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచాడు. సుమారు వెయ్యి సంవత్సరాలు ఈ క్రీడాపోటీలు జరిగాయి. క్రీస్తుశకం 393లో గ్రీకు చక్రవర్తి థియోడొసియస్ క్రీడాపోటీలపై నిషేధం విధించడంతో పురాతన ఒలింపిక్స్ ఆగిపోయాయి. సుమారు 12 వందల ఏళ్ల తర్వాత 1850వ సంవత్సరంలో డాక్టర్ విలియం పెన్నీ బ్రూక్స్ ఒలింపిక్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గ్రీస్‌లో అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు.
మరో 40 ఏళ్ల తర్వాత..
పెన్నీ బ్రూక్స్ ఎంతగా ప్రచారం చేసినా తర్వాత 40ఏళ్లదాకా ఒలింపిక్స్ క్రీడల విషయం ముందుకు కదల్లేదు. చివరికి 1892లో ఫ్రాన్స్‌కు చెందిన పీ యర్ కోబర్టిన్ గట్టిగా ప్రయత్నించడంతో ఒలిం పిక్స్ నిర్వహణపై చర్చ మొదలైంది. 1894లో ‘ప్రపంచ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)’ ఏర్పాటైంది. 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ మొదలయ్యాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహకారం, సోదరభావం పెంపొందించాలన్నదే ఈ క్రీడాపోటీల లక్ష్యమని ప్రకటించారు. కానీ మొదట్లో చాలా దేశాలు ఒలింపిక్స్‌ను అందుకు భిన్నంగా చూశాయి. అప్పట్లో వలస ప్రాంతాల విషయంగా యూరప్ దేశాల మధ్య కొనసాగుతున్న పోటీ, ఆధిపత్య పోరు వంటివి ఒలింపిక్స్‌కు చాలా ప్రాధాన్యం తీసుకొచ్చాయి.
నాలుగేళ్ల తర్వాతే మహిళలకు చాన్స్
ఒలింపిక్స్ మొదలయ్యాక తొలి నాలుగేళ్ల పాటు మహిళా క్రీడాకారులను అనుమతించలేదు. 1890లో తొలిసారిగా టెన్నిస్, సెయిలింగ్, క్రోకెట్ (సుత్తి ఆకారంలో ఉండే బ్యాట్‌తో హాకీ తరహాలో ఆడే క్రీడ), ఈక్వెస్ట్రేనిజం (ఒకరకం గుర్రపు స్వారీ), గోల్ఫ్ క్రీడల్లో మహిళలకు అవకాశం కల్పించారు. ఒలింపిక్స్‌లో మహిళలకు అవకాశం కల్పించిన తర్వాత 90 ఏళ్లపాటు భారత మహిళా క్రీడాకారులెవరూ పతకాలు గెలుచుకోలేదు. తొలిసారిగా 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.
మన దేశం నుంచి వెళ్లింది ఒక్కరే..
ఒలింపిక్స్ మొదలయ్యే నాటికి భారతదేశం బ్రిటీషు వలస పాలనలోనే ఉంది. ఈ క్రమంలోనే 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున నార్మన్ ప్రిచర్డ్ అనే ఒకేఒక్క క్రీడాకారుడు పాల్గొన్నాడు. 1920లో ఆంట్‌వెర్ప్‌లో జరిగిన పోటీల్లో మాత్రం నలుగురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్లు పాల్గొన్నారు.
నాజీల అహంకారాన్ని దెబ్బతీస్తూ..
19వ శతాబ్దం తొలినాళ్ల నుంచీ జర్మనీలో నాజీయిజం పెచ్చుమీరింది. ఆర్యులు అయిన నాజీలు.. మనుషుల్లో తామే అత్యుత్తమ జాతి అని.. నల్లవారు కిందిస్థాయివారని చెప్పుకొనేవారు. ఆ అహంకారానికి 1936లో అమెరికన్ నల్లజాతి క్రీడాకారుడు జెస్సీ ఓవెన్స్ గట్టి దెబ్బకొట్టాడు. బెర్లిన్‌లో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఓవెన్స్ ఒక్కడే ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్నాడు.
భారత హాకీ ‘బంగారం’
భారతదేశానికి చెందిన హాకీ టీమ్ 1928 నుంచే బంగారు పతకాల వేట మొదలుపెట్టింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీలను ఓడించి బంగారు పతకాలను గెలుచుకుంది. తర్వాతి ఐదు ఒలింపిక్స్‌లలోనూ నాలుగు సార్లు గోల్డ్, ఒకసారి సిల్వర్ మెడల్ సాధించింది. చివరిగా 1980లో బంగారు పతకం గెలుచుకున్న హాకీ ఇండియా.. తర్వాతి నుంచి వెనుకబడి పోయింది.
యుద్ధ క్షతగాత్రులతో ‘పారా ఒలింపిక్స్’
సాధారణ ఒలింపిక్స్ జరిగిన తరహాలోనే శారీరకంగా లోపాలు ఉన్న క్రీడాకారుల కోసం ‘పారా ఒలింపిక్స్’ నిర్వహిస్తారు. ప్రతి ఒలింపిక్స్ నుంచి రెండేళ్ల తర్వాత (అంటే ఒలింపిక్స్ జరిగే నాలుగేళ్ల గడువుకు మధ్యలో) ‘పారా ఒలింపిక్స్’ జరుగుతాయి. రెండో ప్రపంచ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్న సైనికులకు గుర్తింపు, పునరావాసం కోసం 1948లో ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించారు. అవే 1960 నుంచి పారా ఒలింపిక్స్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment