Over 36 Lakh Users Downloaded Candy Crush In 3 Hours After MS Dhoni Seen Playing Game - Sakshi
Sakshi News home page

ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..!

Published Mon, Jun 26 2023 11:43 AM | Last Updated on Mon, Jun 26 2023 12:39 PM

Over 36 Lakh Users Downloaded Candy Crush In 3 Hours After MS Dhoni Seen Playing Game - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి సంబంధించిన ఓ వీడియో​ గత కొద్దిగంటలుగా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోలో ధోని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఫ్లయిట్‌లో ప్రయాణిస్తూ తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్‌ గేమ్‌ ఆడుతూ కనిపించాడు. ఎయిర్‌ హోస్టెస్‌ ధోనికి చాక్లెట్లు ఆఫర్‌ చేస్తుండగా ఇది జరిగింది. అంతే ఈ వీడియో చూసిన మరుసటి క్షణమే ధోని అభిమానులు క్యాండీ క్రష్‌ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఏ రేంజ్‌లో సాగిందంటే.. 3 గంటల వ్యవధిలో ఈ గేమ్‌ను 36 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు.

ఒక్కసారిగా తమకు ఇంత గిరాకీ పెరగడం చూసి క్యాండీ క్రష్‌ యాజమాన్యం అవాక్కయ్యింది. ఉన్నట్లుండి డౌన్‌లోడ్స్‌ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణాలు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో క్యాండీ క్రష్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా తమ పాలిట దేవుడైన మహేంద్ర సింగ్‌ ధోనికి కృతజ్ఞతలు తెలిపింది. కేవలం 3 గంటల్లో 3.6 మిలిమన్ల  డౌన్‌లోడ్స్‌.. థ్యాంక్స్‌ టు ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ ఎంఎస్‌ ధోని.. మీ వల్లే ప్రస్తుతం మేము భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నామంటూ తమ ట్వీట్‌లో రాసుకొచ్చింది.

అయితే కొద్దిమంది నెటిజన్లు ధోని ఫ్లయిట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఆడింది క్యాండీ క్రష్‌ కాదని.. అది పెట్‌ రెస్క్యూ సాగా గేమ్‌ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ జనాల్లో ధోనికి ఉన్న క్రేజ్‌ చూస్తే మతిపోతుందని కొందరు అంటున్నారు. ధోనిని ఇంతలా ఫాలో అయ్యే అభిమానులు ఉన్నారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ధోనితో అట్లుంది మరి.. గంటల వ్యవధిలో క్యాండీ క్రష్‌ యజమానులను కుబేరులను చేశాడని అంటున్నారు. ఇంకొందరైతే ఈ సారి ఎన్నికల్లో ధోనిని నిలబెడితే ప్రధాన మంత్రి కూడా అవుతాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవలే ధోని.. ఐదోసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే. ఈ లీగ్‌ అనంతరం ధోని మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని, ప్రస్తుతం క్రికెటేతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే మహేంద్రుడు సోషల్‌మీడియాలో మాత్రం అనునిత్యం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ధోని టీమిండియా మెంటార్‌గా వ్యవహరించనున్నాడని ప్రచారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement