బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్-‘ఎ’ టీమ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా పాక్- బంగ్లా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది.
ఈ రెండు టెస్టులు ఎందుకు కీలకం?
రావల్పిండి వేదికగా ఆగష్టు 21- 25, కరాచీ వేదికగా ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలంటే సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ పాక్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో తమ వ్యూహాల్లో భాగంగా బంగ్లాతో తొలి టెస్టులో కేవలం పేసర్లకు మాత్రమే తుదిజట్టులో చోటివ్వనుంది. ఈ క్రమంలో యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. పాకిస్తాన్ షాహిన్స్- బంగ్లాదేశ్-‘ఎ’ మధ్య ఆగష్టు 20న కరాచిలో మొదలుకానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది.
అందుకే అతడిని రిలీజ్ చేశాం
తద్వారా అతడికి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. ప్రధాన సిరీస్ తొలి టెస్టులో బెంచ్‌కే పరిమితం చేసే బదులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అబ్రార్ అహ్మద్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులాంను రిలీజ్ చేశామని.. అతడు కూడా పాకిస్తాన్ షాహిన్స్ జట్టుతో చేరనున్నట్లు తెలిపింది.
అంతేకాదు.. అతడే పాకిస్తాన్ షాహిన్స్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని పీసీబీ పేర్కొంది. అయితే, అబ్రార్, కమ్రాన్ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ ప్రధాన జట్టుతో చేరతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. మీర్ హంజా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, నసీం షా, సయీమ్ ఆయుబ్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ తదితరులు పాకిస్తాన్ షాహిన్స్(తొలి మ్యాచ్ తర్వాత)ను వీడి ఇప్పటికే బంగ్లాతో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు.
కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ ఆయుబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, ఖుర్రమ్ షెహజాద్, షాహిన్ అఫ్రిది.
బంగ్లాదేశ్- ‘ఎ’ జట్టు(రెండో మ్యాచ్)తో పోటీపడే పాకిస్తాన్ షాహిన్స్ టీమ్
కమ్రాన్ గులాం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అలీ జర్యాబ్, గులాం ముదస్సర్, ఇమామ్ ఉల్ హక్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ అవైస్ అన్వర్, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాద్ బేగ్ (వికెట్ కీపర్), సాద్ ఖాన్, షరూన్ సిరాజ్, ఉమర్ అమీన్.
Comments
Please login to add a commentAdd a comment