
Pat Cummins As 47 Test Captain For Australia.. ఆస్ట్రేలియా 47వ టెస్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను ఎంపికచేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అధికారిక ప్రకటన చేసింది. కీలకమైన యాషెస్ టెస్టు సిరీస్‌కు కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కాగా ఆసీస్ టెస్టు కెప్టెన్‌గా ఒక ఫాస్టెస్ట్ బౌలర్ వ్యవహరించడం ఇదే తొలిసారి. కాగా టిమ్ పైన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పేందుకు సీఏ మొగ్గుచూపింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 8 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడనుంది.
టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడాడు.'' సమ్మర్‌లో కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా జట్టును నడిపిస్తున్న టిమ్ పైన్ వ్యక్తిగత కారణాల రిత్యా తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతని నుంచి స్వీకరించిన కెప్టెన్సీని సక్రమంగా నిర్వహిస్తా. వైస్ కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా అనుభవం ఉండడం నాకు కలిసొచ్చే అంశం. సీనియర్లు, జూనియర్లను కలుపుకుంటూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాలనుకుంటున్నా'' అని చెప్పుకొచ్చాడు.
కాగా టెస్టు కెప్టెన్‌గా ఉన్న టిమ్ పైన్ 2017లో ఒక మహిళతో అసభ్యకర చాటింగ్(సెక్స్ స్కాండల్)లో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో.. అది నిజమేనని ఒప్పుకున్న పైన్ కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అప్పటినుంచి కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పనున్నారనే దానిపై వార్తలు వచ్చాయి. ఒక దశలో స్టీవ్ స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇక టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కమిన్స్ 34 టెస్టుల్లో 164 వికెట్లు పడగొట్టాడు.