పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.
వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్‌లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.
మన స్టేడియాలు బాలేవు
ఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.
ప్రథమ ప్రాధా న్యం అదే
ప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.
ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్‌కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!
Comments
Please login to add a commentAdd a comment