
PC: twitter
ఆస్ట్రేలియా దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2023-24లో భాగంగా ఆడిలైడ్ వేదికగా విక్టోరియా- సౌత్ ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విక్టోరియా బ్యాటర్ పీటర్ హ్యాండ్‌కాంబ్ ఔటైనప్పటికీ మైదానం నుంచి బయటకు వెళ్లేందుకు సముఖత చూపలేదు.
ఏం జరిగిందంటే?
విక్టోరియా ఇన్నింగ్స్ 13 ఓవర్‌లో తొలి బంతిని సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ బెన్ డగెట్ అద్బుతమైన అవుట్ స్వింగర్‌గా సంధించాడు. ఈ క్రమంలో హ్యాండ్‌కాంబ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్‌లో ఉన్న జేక్ లెమాన్ చేతికి వెళ్లింది. దీంతో బౌలర్‌తో పాటు సౌత్ ఆస్ట్రేలియా ఫీల్డర్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు.
అయితే హ్యాండ్‌కాంబ్ మాత్రం అది క్యాచ్ కాదు, నాటౌట్ అని మైదానం విడిచి వెళ్లనని పట్టుబట్టాడు. రిప్లేలో క్లియర్‌గా క్యాచ్‌ను అందుకున్నట్లు తేలినప్పటికి హ్యాండ్‌కాంబ్ మైదానం నుంచి బయటకు వెళ్లకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది.
ఆఖరికి ఫీల్డ్ అంపైర్‌లు జోక్యం చేసుకుని అతడి దగ్గరకు వెళ్లి మాట్లాడి ఫీల్డ్ నుంచి బయటకు పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇదేమి బుద్దిరా బాబు.. అదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా