ఫ్రెంచ్‌ కోటలో కొత్త చరిత్ర | Podoroska Becomes First Female Qualifier In French Open Semi Finals | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ కోటలో కొత్త చరిత్ర

Published Wed, Oct 7 2020 7:09 AM | Last Updated on Wed, Oct 7 2020 7:16 AM

Podoroska Becomes First Female Qualifier In French Open Semi Finals - Sakshi

నదియా పొడొరోస్కా విజయనాదం

తొలి రౌండ్‌ నుంచి మొదలైన సంచలనాల మోత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఇంకా కొనసాగుతోంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా మహిళల సింగిల్స్‌ విభాగంలో తొలిసారి ఓ క్వాలిఫయర్‌ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. కెరీర్‌లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతోన్న అర్జెంటీనాకు చెందిన 131వ ర్యాంకర్‌ నదియా పొడొరోస్కా ఈ ఘనత సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా పారిస్‌ వచ్చిన 23 ఏళ్ల నదియా తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ స్వితోలినాను బోల్తా కొట్టించి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది.

పారిస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ వైదొలగడం... టైటిల్‌ ఫేవరెట్స్‌ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం ... వెరసి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌లో ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో మహిళల సింగిల్స్‌లో ఓ క్వాలిఫయర్‌ సెమీఫైనల్‌ దశకు అర్హత పొందింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 131వ ర్యాంకర్‌ నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) 79 నిమిషాల్లో 6–2, 6–4తో మూడో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)పై గెలిచింది.

ఈ క్రమంలో 23 ఏళ్ల పొడొరోస్కా 2004 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన తొలి అర్జెంటీనా క్రీడాకారిణిగా నిలిచింది. చివరిసారి అర్జెంటీనా తరఫున 2004లో పౌలా సురెజ్‌ ఈ ఘనత సాధించింది. పౌలా సురెజ్‌ కూడా ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనే సెమీఫైనల్‌ చేరింది. ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), క్వాలిఫయర్‌ మారి్టనా ట్రెవిసాన్‌ (ఇటలీ) మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో సెమీఫైనల్లో పొడొరోస్కా ఆడుతుంది. ఆన్స్‌ జెబర్‌ (ట్యూనిషియా)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డానియెలా కొలిన్స్‌ (అమెరికా) 6–4, 4–6, 6–4తో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.  

తడబాటు...  
డిఫెండింగ్‌ చాంపియన్‌ యాష్లే బార్టీ ఈ టోర్నీకి దూరంగా ఉండటం... మాజీ చాంపియన్స్‌ సెరెనా, హలెప్, ముగురుజా... రెండో సీడ్‌ ప్లిస్కోవా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోపే ని్రష్కమించడంతో మూడో సీడ్‌ స్వితోలినాకు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్‌ కలను సాకారం చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది. కానీ పొడొరోస్కా రూపంలో స్వితోలినాకు దెబ్బ పడింది. తన క్వార్టర్‌ ఫైనల్‌ ప్రత్యర్థి పొడొరోస్కా గురించి అంతగా వినలేదని... ఆమె ఆట గురించి కూడా తెలియదని వ్యాఖ్యానించిన స్వితోలినాకు కోర్టులో విభిన్న పరిస్థితి ఎదురైంది. పొడొరోస్కా ఆటపై అవగాహన కలిగేలోపే స్వితోలినా తొలి సెట్‌ను కోల్పోయింది. 35 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లో నాలుగుసార్లు స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన పొడొరోస్కా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.

ఇక రెండో సెట్‌లో ఆరంభంలో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచాక మూడుసార్లు చొప్పున తమ సర్వీస్‌లను నిలబెట్టుకోలేకపోయారు. దాంతో స్కోరు 4–4తో సమం అయ్యింది. ఆ తర్వాత పొడొరోస్కా తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో పొడొరోస్కా తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్‌ చేసింది. స్వితోలినా 8 విన్నర్స్‌ కొట్టగా... పొడొరోస్కా ఏకంగా 30 విన్నర్స్‌ కొట్టింది. నెట్‌ వద్ద పొడొరోస్కా 17 సార్లు... స్వితోలినా  ఏడుసార్లు పాయింట్లు సాధించారు.  

స్వితోలినా
క్వాలిఫయర్‌ అంటే... 
గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’లో 128 మంది ఉంటారు. ఇందులో 104 మందికి ర్యాంకింగ్‌ ద్వారా నేరుగా చోటు కల్పిస్తారు. మిగిలిన 24 మందిలో 8 మందికి నిర్వాహకులు వైల్డ్‌ కార్డులు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన 16 బెర్త్‌లను క్వాలిఫయింగ్‌ నాకౌట్‌ టోర్నీ ద్వారా భర్తీ చేస్తారు. మూడు రౌండ్లపాటు జరిగే క్వాలిఫయింగ్‌ టోర్నిలో 128 మంది పాల్గొంటారు. క్వాలిఫయింగ్‌ టోర్నిలో మూడు మ్యాచ్‌లు నెగ్గి ముందంజ వేసినవారు (16 మంది) మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందుతారు.

►ఈ టోర్నీకంటే ముందు పొడొరోస్కా తన కెరీర్‌లో ఏనాడూ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మ్యాచ్‌ గెలవలేదు. టాప్‌–50 ర్యాంకింగ్స్‌లోపు క్రీడాకారిణిని ఓడించలేదు. 2016లో ఆమె యూఎస్‌ ఓపెన్‌లో ఆడినా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. డబ్ల్యూటీఏ టూర్‌ టోర్నీలలో కూడా ఆమె ఏనాడూ వరుస రెండు మ్యాచ్‌ల్లో నెగ్గలేదు. 

థీమ్‌కు షాక్‌... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆ్రస్టియా) క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించాడు. 5 గంటల 8 నిమిషాలపాటు సాగిన క్వార్టర్‌ ఫైనల్లో 12వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) 7–6 (7/1), 5–7, 6–7 (6/8), 7–6 (7/5), 6–2తో గతేడాది రన్నరప్‌ థీమ్‌పై సంచలన విజయం సాధించాడు. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో సెమీస్‌ చేరాడు. 

►గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల మహిళల సింగిల్స్‌లో పొడొరోస్కా కంటే ముందు క్వాలిఫయర్‌ హోదాలో 1978 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్రిస్టిన్‌ డొరీ (ఆ్రస్టేలియా)... 1999 వింబుల్డన్‌ టోర్నీలో అలెగ్జాండ్రా స్టీవెన్సన్‌ (అమెరికా) మాత్రమే సెమీస్‌ చేరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement