అది‌ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా | Preity Zinta Fumes As Umpiring Mistake | Sakshi
Sakshi News home page

ఒక షార్ట్‌ రన్‌ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది

Published Mon, Sep 21 2020 10:53 AM | Last Updated on Mon, Sep 21 2020 3:30 PM

Preity Zinta Fumes As Umpiring Mistake - Sakshi

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన ఐపీఎల్ మజా ఏంటో రుచి చూపించింది. సూపర్‌ ఓవర్‌దాకా వెళ్లిన మ్యాచ్‌లో రబాడా అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్(89) అసాధారణ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ జట్టు రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్‌ రాహుల్‌, మూడో బంతికి పూరన్‌ ఔట్‌ కావడంతో పంజాబ్‌ కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో సూపర్‌ ఓవర్‌ బరిలోకి దిగిన ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్‌ విక్టరీ అందుకుంది.  (ఢిల్లీని బోణీ కొట్టించిన రబడ)

అయితే పంజాబ్‌ చేజింగ్‌ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పడు సోషల్‌ మీడియాలో వివాదాస్పదమైంది. రబాడా వేసిన 19వ ఓవర్‌లో మూడవ బంతిని ఎక్స్‌ట్రా కవర్‌వైపు ఆడి రెండు పరుగులు తీశారు. అయితే ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్ వాటిలో‌ మొదటి పరుగు షార్ట్‌ రన్‌గా నిర్ణయించాడు. టీవీ రీప్లేలో మాత్రం పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. దీంతో మీనన్‌ నిర్ణయంపై పంజాబ్‌ యజమాని ప్రీతిజింటా అది సరైన నిర్ణయం కాదంటూ ఫైర్‌ అయ్యింది.  (రైజింగ్‌కు వేళాయె...)

ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ఖాతాలో.. 'నేను కరోనా మహమ్మారిని సంతోషంగా జయించాను. 6 రోజుల హోం క్వారంటైన్‌, 5 కోవిడ్‌ పరీక్షలు చిరునవ్వుతో పూర్తి చేసుకున్నాను. కానీ ఒక షార్ట్‌ రన్‌ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటి..?. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఇది. ఇలా ప్రతి సంవత్సరం జరగదు' అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో.. 'నేను ఎప్పుడూ ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను. అయితే ఆటలో మరిన్ని మార్పులు, నిబంధనలు కూడా చాలా ముఖ్యం. జరిగిపోయిన విషయాలను వదిలేసి భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ సానుకూల థృక్పథంతో ముందుకు సాగాలి' అంటూ ట్వీట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement