పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎనిమిదో సీజన్ తొలి మ్యాచ్‌లో ఫకర్ జమాన్ బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 14) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు కొహ్లెర్ కాడ్‌మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కొహ్లెర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (50 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కొహ్లెర్ మెరుపులకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాధ్యతాయుతమైన ఫిఫ్టీ తోడవ్వడంతో పెషావర్ భారీ స్కోర్ సాధించగలిగింది. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, అండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, బెన్ కట్టింగ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీం (47 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చేలరేగినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు.
ఇమాద్‌కు వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం తోడైనప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్‌లో కరాచీ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఇమాద్, బెన్ కట్టింగ్ (9) 13 పరుగులు చేయగలిగారు. ఆఖరి బంతిని ఇమాద్ భారీ సిక్సర్‌గా మలచినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పెషావర్ బౌలర్లలో వాహబ్ రియాజ్, జేమ్స్ నీషమ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ ఇర్షాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 15) ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment