దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్‌ ఆగ్రహం | PSL 2024: Babar Azam Loses Cool Threatens To Hit Spectator With Bottle | Sakshi
Sakshi News home page

Babar Azam: ఏయ్‌ దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్‌ ఆగ్రహం

Published Sat, Feb 24 2024 8:57 PM | Last Updated on Sun, Feb 25 2024 12:53 PM

PSL 2024: Babar Azam Loses Cool Threatens To Hit Spectator With Bottle - Sakshi

కోపోద్రిక్తుడైన బాబర్‌ ఆజం (PC: X)

Angry Babar Azam Fumes At Ill Mannered Fans: పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి బాబర్‌ ఆట తీరును కించపరిచేలా కామెంట్‌ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఈ మాజీ కెప్టెన్‌ అతడి పైకి బాటిల్‌ విసిరాలని చూశాడు.

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. పెషావర్‌ జల్మీ కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ ఆజం.. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు.

ముల్తాన్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బాబర్‌ ఆజం తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పెషావర్‌ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 37 పరుగులతో హసీబుల్లా ఖాన్‌ జల్మీ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బాబర్‌ 31 పరుగులతో అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఇక లక్ష్య ఛేదనలో ముల్తాన్‌ సుల్తాన్స్‌ 174 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్‌ జల్మీ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ సంగతి ఇలా ఉంటే.. డగౌట్‌లో కూర్చున్న సమయంలో బాబర్‌ ఆజంను ఉద్దేశించి ఓ ప్రేక్షకుడు ‘జింబాబర్‌’ అంటూ అరిచాడు.

దీంతో బాబర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్‌ దమ్ముంటే.. ఇక్కడకు రా’’ అంటూ సైగ చేసిన బాబర్‌ ఆజం.. తన చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ విసిరేస్తానంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్‌ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్తానన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘జింబాబర్‌’ అని ఎందుకన్నాడు?
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లితో పోల్చదగిన సమకాలీన క్రికెటర్లలో ఒకడు బాబర్‌ ఆజం అని పలువురు పాక్‌ మాజీ క్రికెటర్ల అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయిలో అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.

అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో బాబర్‌ సతమతమవుతున్నాడు. ముఖ్యంగా పటిష్ట జట్ల మీద మెరుగైన స్కోర్లు సాధించలేకపోతున్నాడు. జింబాబ్వే వంటి పసికూన జట్లపై మాత్రం సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా.. ‘‘జింబాబర్‌’’అంటూ నెటిజన్లు అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. బాబర్‌ కోపోద్రిక్తుడయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement