సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో తాను రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌తో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెగదెంపులు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టే సంగ్ వద్ద ఇకపై సింధు ప్రాక్టీస్ చేయబోవడం లేదు. ఇటీవల తాను ఆశించిన విజయాలను సింధు అందుకోలేకపోవడమే అందుకు కారణం. తమ భాగస్వామ్యం ముగిసిందనే విషయాన్ని పార్క్ స్వయంగా ధ్రువీకరించాడు. సింధు పరాజయాల్లో తన పాత్ర కూడా ఉందని అతను పేర్కొనడం విశేషం.
గాయంతో ఐదు నెలలు ఆటకు దూరమైన సింధు జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిన ఆమె, సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ అనూహ్యంగా మొదటి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. టీమ్ ఈవెంట్ అయిన ఆసియా మిక్స్‌డ్ చాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్ గెలవగలిగినా... ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో దిగువన ఉన్న గావో ఫాంగ్ జి చేతిలో పరాజయం ఊహించనిది.
2019 నుంచి సింధుకు పార్క్ వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నాలుగేళ్లలో మూడు బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో కూడా సింధు స్వర్ణం సాధించింది. అన్నింటికి మించి టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించడం పార్క్‌కు పేరు తీసుకొచి్చంది. ఈ విజయం తర్వాత అన్ని వేదికల్లోనూ తన పతక సాధనకు పార్క్‌నే కారణంగా చూపిస్తూ సింధు ప్రశంసలు కురిపించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధన ల ప్రకారం పార్క్ ఇప్పటికే గచ్చిబౌలిలో భారత జూని యర్ జట్టుతో చేరి వర్ధమాన ఆటగాళ్ల కోచింగ్‌లో నిమగ్నమయ్యాడు.
సుచిత్ర అకాడమీలో...
భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి విడిపోయిన తర్వాత సింధు ‘సుచిత్ర అకాడమీ’లోనే సాధన చేస్తోంది. భారత ప్రభుత్వం వారి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ప్రకారం తన వ్యక్తిగత కోచ్‌ను ఎంచుకునే అవకాశం సింధుకు ఉంది. భారత జట్టు కోచ్‌గా వచ్చిన పార్క్‌ను ఈ సౌలభ్యం కారణంగానే తన వ్యక్తిగత కోచ్‌గా మార్చుకొని ‘సుచిత్ర’లో సింధు ప్రాక్టీస్ కొనసాగించింది.
ఇటీవల తమ అకాడమీలోని దాదాపు 35 మంది షట్లర్ల శిక్షణ కోసం ‘సుచిత్ర అకాడమీ’ మలేసియా మాజీ ఆటగాడు హఫీజ్ హషీమ్‌తో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. దాంతో సింధు కూడా హఫీజ్ వద్ద శిక్షణ తీసుకోవడం ఖాయమైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీ (మార్చి 14–19)కి ముందు కనీసం రెండు వారాలు హఫీజ్ వద్ద సింధు ప్రాక్టీస్ చేయనుంది. అయితే హఫీజ్‌ను పూర్తి స్థాయిలో అధికారికంగా ‘వ్యక్తిగత కోచ్’గా సింధు నియమించుకుంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. హఫీజ్ 2003లో ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజేతగా నిలిచాడు.
సింధుతో నా భాగస్వామ్యం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇటీవల ఆమె ప్రదర్శన బాగాలేదు. ఒక కోచ్‌గా నేను కూడా అందుకు బాధ్యుడనే. అందుకే ఆమె మార్పు కోరుతుంది. కొత్త కోచ్ కావాలని ఆశిస్తోంది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో లేకపోవడం కొంత బాధగా ఉన్నా మరో రూపంలో సింధుకు సహకరిస్తా. ఆమెతో కోచింగ్‌లో పాల్గొన్న ప్రతీ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. –పార్క్ టే సంగ్
Comments
Please login to add a commentAdd a comment