
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరిన నాదల్ ఆదివారం డానియెల్ మెద్వెదెవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. ఫైనల్లో నాదల్ గెలిస్తే గనుక టెన్నిస్‌లో పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్, ఫెదరర్‌లతో సమానంగా ఉన్న నాదల్.. ఒక్క టైటిల్ గెలిస్తే చరిత్ర సృష్టించనున్నాడు. 21 గ్రాండ్‌స్లామ్‌లతో అత్యధిక టైటిళ్లు గెలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా నాదల్ నిలవనున్నాడు.
చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో మెద్వెదెవ్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైన నాదల్ ప్రాక్టీస్ సమయంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''రెండు నెలల క్రితం తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది. తరచూ గాయాల బారీన పడుతుండడంతో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. దాంతో ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించా. ఈ విషయమై తన టీమ్‌తో పాటు కుటుంబసభ్యులతో కూడా చర్చించాను. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి.. ఇలాగే కొనసాగితే విమర్శలు తప్ప విజయాలు దక్కవు అని కుమిలిపోయా.. అయితే ఇదంతా రెండు నెలల క్రితం. కట్ చేస్తే ఇప్పుడు బౌన్స్‌బ్యాక్ అయ్యాననిపిస్తుంది.
మెద్వెదెవ్‌తో జరగబోయే ఫైనల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తానో లేదో తెలియదు కానీ.. నా ఆటపై ఆత్మవిశ్వాసం మరింతం పెరిగింది. ఆ ధైర్యంతోనే రేపటి ఫైనల్‌ను ఆడబోతున్నా'' అంటూ ముగించాడు. ఇప్పటివరకు టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్ ఖాతాలో 13 ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment