
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కీలక విజయంపై గురి పెట్టింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆ జట్టు మూడో రోజు గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.
తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్ రెడ్డి (0) అవుట్ కాగా...రోహిత్ రాయుడు (46 నాటౌట్), అలంకృత్ అగర్వాల్ (7 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు హైదరాబాద్ మరో 326 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 230/3తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.
రికీ భుయ్ (150 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (70 బంతుల్లో 89; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ఆపై కరణ్ షిండే (180 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు.