Ranji Trophy 2022-23: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహచరుడు, ఐపీఎల్‌లో సీఎస్‌కే మాజీ సభ్యుడు, మహారాష్ట్ర వెటరన్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ లేటు వయసులో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. 37 ఏళ్ల కేదార్ జాదవ్ ప్రస్తుత రంజీ సీజన్‌లో (2022-23) వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.
కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతకంతో (283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు) విరుచుకుపడిన కేదార్.. ఇవాళ (జనవరి 24) ముంబైతో ప్రారంభమైన కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో (168 బంతుల్లో 128; 18 ఫోర్లు, సిక్స్) కదం తొక్కాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
కేదార్ సెంచరీతో ఆదుకోకపోయుంటే మహారాష్ట్ర కనీసం 200 పరుగులు చేయడం కూడా కష్టమయ్యేది. సౌరభ్ నవాలే (56), అశయ్ పాల్కర్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబై జట్టు భీకర ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించకపోవడం కొసమెరుపు.
ఇదిలా ఉంటే, ఎలైట్ గ్రూప్-బిలో పోటీపడుతున్న మహారాష్ట్ర, ముంబై జట్లు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో చెరో 3 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 2 (మహారాష్ట్ర, 25 పాయింట్లు), 3 (ముంబై, 23 పాయింట్లు) స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 26 పాయింట్లు) తొలి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 19 పాయింట్లు) నాలుగో ప్లేస్‌లో ఉన్నాయి.
తమిళనాడు (15 పాయింట్లు), అస్సాం (11 పాయింట్లు), ఢిల్లీ (11 పాయింట్లు), హైదరాబాద్ (1 పాయింట్) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో నిలిచాయి. క్వార్టర్స్ బెర్తు కోసం ఈ గ్రూప్ నుంచి సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ముంబై జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు గ్రూప్-సి నుంచి కర్ణాటక, గ్రూప్-ఏ నుంచి బెంగాల్ ఇదివరకే క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment