రాణించిన రాహుల్, తన్మయ్
రాజస్తాన్‌తో రంజీ మ్యాచ్
జైపూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీలో గత మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యంతో ఘనవిజయం సాధించిన హైదరాబాద్ జట్టు... మరోసారి స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం రాజస్తాన్‌తో ప్రారంభమైన గ్రూప్ ‘బి’ నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లందరూ బాధ్యతాయుతంగా ఆడారు.
ఫలితంగా హైదరా బాద్ గౌరవప్రద స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కెపె్టన్ రాహుల్ సింగ్ (100 బంతుల్లో 66; 7 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (43 బ్యాటింగ్; 3 ఫోర్లు), ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (40; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అభిరత్ రెడ్డి (21; 4 ఫోర్లు), రోహిత్ రాయుడు (21; ఒక సిక్స్), హిమతేజ (24; 3 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు.
కెప్టెన్ రాహుల్ సింగ్ మాత్రం ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసు కొచ్చాడు. అంతర్జాతీయ క్రికెటర్లు దీపక్ చహర్, దీపక్ హుడా వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. రాజస్తాన్ బౌలర్లలో అజయ్ సింగ్ 3, దీపక్ చహర్, అరాఫత్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆట ముగిసే సమయానికి రాహుల్ రాదేశ్‌తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment