ప్రపంచ 249వ ర్యాంకర్‌పై 6–0, 6–0తో విజయం
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 486వ ర్యాంకర్ రషి్మక 6–0, 6–0తో ప్రపంచ 249వ ర్యాంకర్ జస్టినా మికుల్‌స్కయిటీ (లిథువేనియా)పై జయభేరి మోగించింది.
48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా ‘డబుల్ బేగల్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్‌ను 6–0తో గెలిస్తే టెన్నిస్ పరిభాషలో దానిని ‘బేగల్’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు సెట్‌లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. జస్టినా సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్‌లో మూడుసార్లు గేమ్ పాయింట్లను కాపాడుకుంది.
మరోవైపు డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ 6–1, 7–6 (8/6)తో హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి–జీల్ దేశాయ్ (భారత్) జంటపై గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
నేడు జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ యా సువాన్ లీ (చైనీస్ తైపీ)–షోయున్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీతో రషి్మక–వైదేహి జంట తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ పొలీనా లాచెంకో (రష్యా)తో రషి్మక ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment