‘ఫైండ్‌ ఆఫ్‌ ది టూర్’‌ అతడే: రవిశాస్త్రి | Ravi Shastri Calls This Cricketer Find Of The Australia Tour | Sakshi
Sakshi News home page

‘ఫైండ్‌ ఆఫ్‌ ది టూర్’‌ అతడే: రవిశాస్త్రి

Published Fri, Jan 22 2021 6:26 PM | Last Updated on Fri, Jan 22 2021 6:37 PM

Ravi Shastri Calls This Cricketer Find Of The Australia Tour - Sakshi

తండ్రి మరణించినప్పటికీ బాధను దిగమింగుకుని, ఆసీస్‌లోనే ఉండి తన ప్రతిభను నిరూపించుకున్న తీరును రవిశాస్త్రి కొనియాడాడు.

న్యూఢిల్లీ: ‘‘వ్యక్తిగతంగా పూడ్చలేని లోటు.. వర్ణ వివక్ష వ్యాఖ్యల బారిన పడటం వంటి కఠిన పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌ అటాక్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈ పర్యటనలో టీమిండియాకు లభించిన ఆటగాడు(ఫైండ్‌ ఆఫ్‌ ది టూర్‌)- మహ్మద్‌ సిరాజ్‌’’ అంటూ భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. తండ్రి మరణించినప్పటికీ బాధను దిగమింగుకుని, ఆసీస్‌లోనే ఉండి తన ప్రతిభను నిరూపించుకున్న తీరును కొనియాడాడు. కాగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్‌.. సీనియర్ల గైర్హాజరీలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు.(చదవండి: కోహ్లి‌, అజ్జూ భాయ్‌ ప్రోత్సాహం మరువలేను: సిరాజ్‌)

ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా గబ్బాలో టీమిండియా సాధించిన చారిత్రక విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్‌ టెస్టు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్‌ అభిమానులకు బంతితోనే సమాధానమిచ్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్‌ పర్యటన వల్ల టీమిండియాకు మంచి బౌలర్‌ దొరికాడంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు.

ఇక ఇప్పుడు రవిశాస్త్రి కూడా అదే మాట అంటున్నాడు. కాగా టీమిండియాతో పాటు గురువారం స్వదేశానికి చేరుకున్న సిరాజ్‌.. స్వస్థలం హైదరాబాద్‌కు రాగానే తొలుత తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్‌లో తన ప్రదర్శనను తండ్రికి అంకితమిస్తున్నానని, భారత్‌లో ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్‌కు సన్నద్ధమవుతానని తెలిపాడు.(చదవండి‘ప్రాక్టీస్‌ వద్దంటే గోల చేసేవాడు.. తను లెజెండ్‌ అవుతాడు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement