బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన టీమిండియా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడేజా, అశ్విన్, ఉమేశ్ యాదవ్ ప్రదర్శనలు మినహా, టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి రెండు టెస్ట్‌ల్లో ఓ మోస్తరుగా రాణించిన మహ్మద్ షమీని ఉమేశ్ యాదవ్‌కు ఓ అవకాశం ఇవ్వడం కోసం మూడో టెస్ట్‌లో బెంచ్‌కు పరిమితం చేసింది మేనేజ్‌మెంట్. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉమేశ్ బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపించి, నాలుగో టెస్ట్‌లో చోటు పక్కా చేసుకున్నాడు.
మూడో టెస్ట్‌లో ఓటమి నేపథ్యంలో పోస్ట్‌మార్టం చేసుకుంటున్న టీమిండియా.. నాలుగో టెస్ట్‌లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా షమీని తిరిగి ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకురావాలని భావిస్తున్న మేనేజ్‌మెంట్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించని మహ్మద్ సిరాజ్‌పై వేటు వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే మూడు టెస్ట్‌ల్లో ఏ మాత్రం ఆకట్లుకోని వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్‌ను తప్పించి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం కల్పించాలని ద్రవిడ్ అండ్ కో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా రెండు మార్పులతో నాలుగో టెస్ట్ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం.
మరో 5 రోజుల్లో (మార్చి 9) అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్ట్‌లో భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఐదు రోజుల్లో గాయాల పరంగా ఎలాంటి కంప్లైంట్స్ రాకపోతే, ఈ రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగో టెస్ట్ సమయానికంతా సిద్ధంగా ఉంటాడని ఆసీస్ మేనేజ్‌మెంట్ సూచనప్రాయంగా తెలిపింది. మూడో టెస్ట్‌లో వేలి గాయంతో ఇబ్బంది పడిన స్టార్క్ స్థానంలో కమిన్స్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ ఒక్క మార్పు మినహాయించి మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన జట్టునే ఆసీస్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment