
photo credit: IPL Twitter
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వయసు మీద పడుతున్నా ఆట విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 38 వయసులోనూ కుర్రాడిలా రెచ్చిపోతూ పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నప్పటికీ వీరలెవెల్లో విజృంభిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ కుర్రాళ్లకు సైతం అసూయ పడేలా చేస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్న డుప్లెసిస్.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 67.50 సగటున 165.71 స్ట్రయిక్‌రేట్‌తో 405 పరుగులు సాధించాడు. ఇందులో 33 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఇతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. డుప్లెసిస్ భీకర ఫామ్‌ను చూసి సహచర స్టార్ ఆటగాళ్లు సైతం ముక్కున వేళ్లేసుకుంటున్నారు. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్నా పాతబడ్డ వైన్‌లా ఆటతో మత్తెక్కిస్తున్నాడంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
ప్రస్తుత సీజన్‌లో డుప్లెసిస్ చేసిన స్కోర్ల వివరాలు..
- ముంబై ఇండియన్స్‌పై 73(43)
- కేకేఆర్‌పై 23(12)
- లక్నో సూపర్ జెయింట్స్‌పై 79*(46)
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై 22(16)
- చెన్నై సూపర్ కింగ్స్‌పై 62(33)
- పంజాబ్ కింగ్స్‌పై 84(56)
- రాజస్థాన్ రాయల్స్‌పై 62(39)