
ఐపీఎల్ మరో లెవల్‌కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్‌తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు.
2008లో తొలి ఐపీఎల్ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్ డాక్యుమెంట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment