రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బలహీనంగా కనిపించిన టీమిండియా బౌలింగ్ రెండో వన్డేలో మాత్రం అదిరింది. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన పేస్ పదునుతో కివీస్ బ్యాటర్లను వణికించాడు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత మిగతా పనిని సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, సుందర్‌లు పూర్తి చేశారు. మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. భారత బౌలర్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం మాకు కలిసొచ్చే అంశం. ఈ ప్రదర్శన ఇక్కడికే పరిమితం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రోహిత్ వెల్లడించాడు.
రోహిత్ మాట్లాడుతూ.. 'గత ఐదు మ్యాచ్‌ల్లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేం అడిగిందల్లా చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక భారత్‌లో ఇలాంటి పేస్ పిచ్‌లను చూసుండరు. విదేశాల్లోనే ఇలాంటి వికెట్లను తరుచూ చూస్తుంటాం. మా బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలున్నాయి. శుక్రవారం ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫ్లడ్ లైట్స్ కింద బంతి స్వింగ్ అవ్వడం గమనించాం. దాంతో న్యూజిలాండ్ 250 పరుగులు చేసినా పోరాడే లక్ష్యమని భావించాం. ఈ ఆలోచనతోనే చేజింగ్‌కు మొగ్గు చూపాను. గత మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో.. ఈ మ్యాచ్‌లో మమ్మల్ని మేం సవాల్ చేసుకోవాలనుకున్నాం. కానీ మేం అనుకున్న కఠిన పరిస్థితులు ఎదురవ్వలేదు.
ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జట్టులో ప్రతీ ఒక్కరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. జట్టును ఇలా చూడటం గొప్పగా ఉంది. షమీ, సిరాజ్‌లు లాంగ్ స్పెల్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఉందనే విషయాన్ని వారికి నేను గుర్తు చేస్తున్నాను. ఈ సిరీస్ నేపథ్యంలో మేం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నా ఆటను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం ముఖ్యమని భావిస్తున్నా. నేను భారీ స్కోర్లు చేయడం లేదనే విషయం తెలుసు. దాని గురించి నేను బాధపడటం లేదు. అతి త్వరలోనే భారీ స్కోర్ సాధిస్తాననే నమ్మకం ఉంది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 20.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, గిల్ 40 పరుగులు చేశాడు.
చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా!
Comments
Please login to add a commentAdd a comment