పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. తన భార్య రితికా రెండో బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ భారత్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ముంబైకర్ పెర్త్ టెస్టుకు అందుబాటులో లేడు.
అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సిద్దమయ్యాడు. తొలుత డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు హిట్‌మ్యాన్ జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు భారత కెప్టెన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే రోహిత్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. నవంబర్ 24న రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట సమయానికి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"రోహిత్ శర్మ ఈ నెల 23 తేదీన ముంబై నుంచి ప్రత్యేక విమానంలో 24న పెర్త్ చేరుకోనున్నారు. ఆ తర్వాత అతడు జట్టుతో కలిసి తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. అదే విధంగా అడిలైడ్‌లో జరిగే డే-నైట్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం కోచింగ్ సిబ్బందితో చర్చించనున్నాడు.
అదే విధంగా కాన్‌బెర్రాలో ప్రాక్టీస్ గేమ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక తొలి టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు.
చదవండి: మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్
Comments
Please login to add a commentAdd a comment