
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (IND VS ENG 3rd ODI) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 13 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్‌లో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా.. నాలుగో భారతీయ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.
వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14232), విరాట్ కోహ్లి (13911), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430), మహేళ జయవర్దనే (12650), ఇంజమామ్ ఉల్ హక్ (11739), జాక్ కల్లిస్ (11579), సౌరవ్ గంగూలీ (11363) మాత్రమే 11000 పరుగుల మైలురాయిని దాటారు.
విరాట్ తర్వాత అత్యంత వేగంగా..!
నేటి మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగుల మైలురాయిని తాకితే.. విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ 259 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 10987 పరుగులు చేశాడు. విరాట్.. 11000 పరుగుల మైలురాయిని తన 222వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు.
సెంచరీ చేస్తే మరో రికార్డు
నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లి (81) తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు సచిన్, విరాట్, పాంటింగ్ (71), సంగక్కర (63), కల్లిస్ (62), హాషిమ్ ఆమ్లా (55), జయవర్దనే (54), బ్రియాన్ లారా (53), జో రూట్ (52) మాత్రమే యాభై సెంచరీలు పూర్తి చేశారు.
కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలోనూ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.